నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు (Nalgonda SC and ST Special Sessions Court)సంచలన తీర్పు వెలువరించింది. హత్య కేసులో 18 మంది నిందితులకు జీవిత ఖైదు, రూ.6 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలిచ్చింది.
అసలు ఏమి జరిగిందంటే
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో 2017 దసరా రోజున గ్రామంలో ఓ గొడవ జరిగింది. గ్రామానికి చెందిన బట్ట లింగయ్య అనే దళితుడు పూజ కోసం జమ్మిచెట్టు వద్దకు వచ్చాడు. అదే సమయంలో బట్ట లింగయ్యను రామస్వామి మరికొందరు కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ కులం పేరుతో దూషిస్తూ కర్రలు రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన లింగయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.
మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు
మృతుడు లింగయ్య కుమారుడు వెంకన్న ఫిర్యాదుతో అడ్డ గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 18 మంది నిందితులపై హత్యా నేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. దర్యాప్తులో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో అడ్డగూడూరు పోలీసులు చార్జిషీట్ వేశారు. ఈ కేసు నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టులో ట్రయల్స్ జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
18 మందికి జీవిత ఖైదు
ఈ కేసులో 18 మందికి జీవిత ఖైదుతోపాటు రూ.6 వేల రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి రోజా రమణి తీర్పు ఇచ్చారు. ఈ కేసు ట్రయల్స్ సమయంలోనే మరో వ్యక్తి మృతి చెందాడు. మిగిలిన 17 మంది నిందితులను పోలీసులు జైలుకు తరలించారు.