రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణను రూ.12 లక్షల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
అడిబట్ల గ్రామంలోని సర్వే నంబర్ 355లో 7 గుంటల భూమిని పట్టదారు పాస్‌బుక్‌లో చేర్చేందుకు, అలాగే ఆ ఫైల్‌ను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కార్యాలయంలో ప్రాసెస్ చేయించేందుకు గోపాలకృష్ణ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఇది వరకే 3 లక్షలు ఇచ్చాడు. మిగతావి ఇవ్వడం ఇష్టం లేక బాధితులతో ఒకరైన ఇమ్మిడి బాలకృష్ణ ఏసీబీని ఆశ్రయించారు.
ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఇక ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆనంతరెడ్డి, ఎమ్మార్వో సునీత, డీటీ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణలను దాదాపు 3 గంటల పాటు అధికారులు విచారించారు.
ప్రజలు లంచం వంటి అక్రమాలకు పాల్పడే అధికారులపై ఫిర్యాదు చేయాలంటే, ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.