Saturday, July 12, 2025
HomeTS జిల్లా వార్తలు1 Crore Ex Gratia: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం: సిగాచి కంపెనీ ప్రకటన

1 Crore Ex Gratia: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం: సిగాచి కంపెనీ ప్రకటన

Sigachi Plant Blast: సీఎం రేవంత్ రెడ్డి సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. సీఎం ఆగ్రహంతో కంపెనీ ఎట్టకేలకు స్పందించింది. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం అందజేస్తామని సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో మొత్తం 40 మంది మృతి చెందారని పేర్కొన్నారు. 33 మంది గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు పూర్తి వైద్యసాయం అందిస్తామని పేర్కొన్నారు.  బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. పరిశ్రమ నుంచి కోటి పరిహారంతో పాటు అన్ని బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తామని పేర్కొన్నారు. అలాగే, పాశమైలారం పరిశ్రమ ప్రమాదంపై స్టాక్ మార్కెట్‌కు లేఖ రాశారు. మూడు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, ప్రభుత్వ దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

పాశమైలారం సిగాచి ప్రమాద ఘటనా స్థలిని నిన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించిన విషయం తెలిసిందే.  మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతుల పిల్లల చదువుల బాధ్యత తమ ప్రభుత్వానిదే అని, వారిని గురుకులాల్లో చేర్పించేలా కృషి చేయాలని అధికారులకు సూచించామన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున వైద్యం అందించే బాధ్యత సైతం తీసుకుంటామని చెప్పారు. మృతదేహాలను సొంత గ్రామాలు తరలించేందుకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.

ALSO READ: https://teluguprabha.net/international-news/india-pak-prisoner-exchange/

ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఇన్ని ప్రాణాలను బలిగొన్న ప్రమాదం మరొకటి లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్, హైడ్రా, డిజాస్టర్, రెవెన్యూ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. మృతులు, క్షతగాత్రులు బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణకు చెందిన వారు ఉన్నారన్నారని తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం 43 మంది చనిపోయారని.. ప్రమాద సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారని, 58 మంది వివరాలు అధికారుల దృష్టిలోకి వచ్చాయన్నారు. మిగతా వారు శిథిలాల కింద ఉన్నారా? లేక భయంతో ఎక్కడైనా ఉండిపోయారా అనేది స్పష్టంగా తెలియదన్నారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ.లక్ష, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందించాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని సీఎం తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఘటనపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని, ప్రాథమిక సమాచారం తర్వాత ప్రమాదంపై పూర్తి వివరాలు చెబుతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ALSO READ: https://teluguprabha.net/business/hdb-financial-services-listing-premium-gain/

ఘటనపై డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కెమికల్ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదం జరిగి 24 గంటలవుతున్నా ఘటనా స్థలికి యాజమాన్యం రాకపోవడంపై సీరియస్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News