చెత్తను సేకరించి రీసైక్లింగ్ చేసేందుకు మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన డంప్ లో చెత్తను రీసైక్లింగ్ చేసి, కంపోస్టుగా మారుస్తామంటూ తమను ఏమార్చి స్థానికంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుతో తీవ్ర అనారోగ్యంపాలవుతున్నామని మిర్యాలగూడ రాంనగర్ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రీసైక్లింగ్ విధానం పోయి, ఇక్కడి చెత్తను మొత్తం తగుల పెడుతుండటంతో తాము ప్రత్యక్ష నరకం చూస్తున్నామని వీరు వాపోతున్నారు. పొగ కారణంగా తమ కాలనీతో పాటు ఈదులగూడ, ఎనె కాలనీ, మండలంలోని గూడూరు, బాధలపురం గ్రామాలకు విస్తరించి ఇండ్లలో ఉండలేని దుస్థితి తలెత్తింది. ఈ పొగ వల్ల తీవ్ర అనారోగ్య పాలవుతున్నట్టు స్థానికులంతా పలుమార్లు అధికారులకు చెప్పుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బాధితులంతా కలిసి రాంనగర్ డంప్ ను తరలించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. సిహెచ్ వినోద్, ఎం. నాగేందర్, వి. నాగరాజు, జి.రమేష్, ఎం. నాగరాజు, సందీప్ తోపాటు రాంనగర్ వాసులు, చుట్టుపక్కల గ్రామస్థులు కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.