Lagacharla| సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. లగచర్ల (Lagacharla) గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు అధికారులపై దాడి ఘటనలో 55 మందిని అరెస్ట్ చేశారు. రైతుల అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్(KTR), హరీష్‌రావు(Harishrao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరు అమానుషమని.. అరెస్ట్ చేసిన లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీగా పోలీసులు చేరుకుని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన రైతులను పోలీసులతో బెదిరించాలని చూస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు ఏమైనా తీవ్రవాదులా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలనా.. రైతు సంక్షేమ పాలన అంటూ ధ్వజమెత్తారు. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు అధికారులపై దాడి ఘటనకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. వికారాబాద్ జిల్లాలో అయితే ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
కాగా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీకి సంబంధించి భూసేకరణ కోసం అధికారులు గ్రామస్తుల వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.