సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులతో సచివాలయం ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఫైళ్లు, అప్లికేషన్లు, మీటింగ్స్‌తో మంత్రులతో సహా సిబ్బంది కూడా క్షణం తీరిక లేకుండా ఉంటారు. మంత్రి సీతక్క కార్యాలయం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ, గురువారం మాత్రం మంత్రి సీతక్క ఛాంబర్ చీరల సందడితో నిండిపోయింది.
సీతక్క మనసు దోచిన చీరలివే
రంగురంగుల చీరలు, వెరైటీ బోర్డర్లు, కొత్త కొత్త డిజైన్లతో ఉండి మంత్రి సీతక్క మనసు దోచేశాయి. ఏ రంగు చీర తీసుకోవాలి, డిజైన్, బోర్డర్, క్వాలిటీపై ఆమె డైలమాలో పడ్డారు. దీంతో మంత్రికి ఐఏఎస్ అధికారులు అనితా రామచంద్రన్, కాంతి వెస్లీతో సహా సిబ్బంది కూడా శారీస్ సెలక్షన్‌లో సాయం చేశారు. అయితే, మంత్రి సీతక్క సెలక్ట్ చేసిన చీరలు తన కోసం కాదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే యూనీఫామ్. దాంతో పాటే మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు ఉచిత చీరలను ఎంపిక చేయడానికి కావడం కొసమెరుపు. కాగా, అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూనిఫాం నిర్దేశించింది. ఇకపై అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది యూనిఫాం చీరలు మాత్రమే ధరించి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
63 లక్షల మందికి ఉచిత చీరలు
తెలంగాణ చరిత్రలో మొదటిసారి మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు యూనిఫాం చీరలు ఉచితంగా పంపిణీ చేయనుంది. యూనిఫాం చీరల కోసం ప్రత్యేక డిజైన్లను చేనేత సంఘాలు రూపొందించి పరిశీలన కోసం మంత్రి కార్యాలయానికి పంపించడం వివేషం.
త్వరలో ఈ చీరలపై సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ సిబ్బంది పాల్గొన్నారు.