10వ తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రశ్నాపత్రాల లీకేజ్ సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ… 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రశ్నాపత్రాలు లీకేజ్ సంఘటనలు పునరావృతం కాకుండా మిగతా పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని, కలెక్టర్లు, పోలీస్ కమీషనర్, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో దాదాపు 57 వేల మంది విధులు నిర్వహిస్తున్నారని, ఒకరిద్దరు చేసిన తప్పిదానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని, పరీక్ష కేంద్రాలు, సమీప ప్రాంతాలలో 144 సెక్షన్ను కఠినంగా అమలు చేయాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల లోనికి ఎవరికి సెల్ఫోన్లను అనుమతించరాదని, జిల్లా కలెక్టర్లు, తహశిల్దార్లు సైతం సెల్ఫోన్ తీసుకు వెళ్ళకూడదని తెలిపారు. పరీక్ష ముగిసిన అనంతరం జవాబు పత్రాల తరలింపు సమయంలో స్థానిక తపాలా అధికారులకు అవసరమైన సహకారం అందించాలని, మిగిలిన నాలుగు పరీక్షలు సజావుగా జరిగేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, పోలీసు ఆధ్వర్యంలో అదనపు పెట్రోలింగ్ చేయాలని, క్షేత్రస్థాయిలో అలసత్వం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, డిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలకు 10,125 మంది విద్యార్థులు హాజరవుతున్నందున పరీక్షల నిర్వహణ కొరకు 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
పరీక్షలు సజావుగా సాగేందుకు పోలీసు, రెవెన్యూ, తపాల శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని, పరీక్ష కేంద్రాలలోని సెల్ఫోన్ అనుమతించకూడదని తెలిపారు. జవాబు పత్రాల తరలింపు కోసం తపాలాశాఖ అధికారులకు అవసరమైన సహకారం అందించాలని, పరీక్షల నిర్వహణ కొరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.