హైదరాబాద్(Hyderabad)లో విషాదం నెలకొంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో పదో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నగరంలోని టీఎన్‌జీవో కాలనీకి చెందిన ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసేందుకు గచ్చిబౌలిలోని పరీక్ష కేంద్రానికి వెళ్లింది. పరీక్ష రాసిన తర్వాత సోదరుడు బైక్ మీద యువతి ఇంటికి బయలుదేరింది. అయితే మార్గమాధ్యలో గచ్చిబౌలి ఫైఓవర్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్ కింద పడింది.
ఈ ప్రమాదంలో విద్యార్థిని ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. సోదరుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువితి మరణవార్త తెలుసుకుని కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.