Group 3 Exams| తెలంగాణలో గ్రూప్-3 పరీక్షలు ఈనెల 17,18 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGSPC) చైర్మన్ మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కమిషన్ కార్యదర్శి, సభ్యులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్సీలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పరీక్ష నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గ్రూప్-3 పరీక్షకు 5 లక్షల 30 వేల మంది అభ్యర్థులు హాజరకానున్నారని చైర్మన్ చెప్పారు. ఇందులో భాగంగా 1,401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని పరీక్ష కేంద్రాలలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచడం జరుగుతుందన్నారు.
ఇక స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు తరలింపు కొరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్ తప్ప వేరే ఎవరికీ మొబైల్ అనుమతి లేదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.