Lottery : ఉద్యోగం చేస్తూ, సాధారణ జీవితం గడుపుతున్న ఓ యువకుడికి అదృష్టం అనూహ్యంగా తలుపు తట్టింది. కోట్లాది రూపాయల లాటరీ గెలుచుకుని, రాత్రికి రాత్రే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పుట్టింది రైతు కుటుంబంలో అయినా, తన ప్రతిభతో సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడిన ఆ యువకుడు.. ఇప్పుడు రూ. 240 కోట్ల భారీ లాటరీని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు.అతనే ఆంధ్రప్రదేశ్‌లోని వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్.
అనిల్ కుమార్ ప్రస్తుతం యూఏఈ (UAE) లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన కుటుంబంపై ఉన్న ప్రేమను, సెంటిమెంట్‌ను పెట్టుబడిగా పెట్టి… తన తల్లి పుట్టినరోజు తేదీ సంఖ్య కలిగిన లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. గతంలోనూ చాలా లాటరీ టికెట్లు కొని ఓపిగ్గా వేచి చూసిన అనిల్‌ను ఈసారి అదృష్టం ప్రేమగా పలకరించింది. ఆ సెంటిమెంట్ పనిచేసి, ఆ ఒక్క టికెట్‌కే ఏకంగా 240 కోట్ల రూపాయల బహుమతి దక్కింది.ఈ అనూహ్య విజయం అనిల్ జీవితాన్ని తలకిందులు చేసింది. కష్టం విలువ తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన అనిల్‌కు, ఈ డబ్బు సక్రమంగా వినియోగిస్తే, తరాల పాటు ఆర్థిక భద్రతను అందించనుంది.
నిపుణుల హెచ్చరిక
అయితే, అనిల్ లాంటి అరుదైన విజేతల కథలు విన్నప్పుడు, చాలా మంది తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.లాటరీ గెలుచుకున్న వారి కథలు మాత్రమే వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. కానీ, లాటరీలలో డబ్బు కోల్పోయి నష్టపోయిన వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని గుర్తుంచుకోవాలి. లాటరీలనేవి జూదం వంటివి. వీటిని తరచూ కొనడం వల్ల ఆర్థిక నష్టం జరగడమే కాక, ఇది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది.కష్టపడి సంపాదించడం, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు పెట్టడం, ప్లానింగ్ ద్వారానే సుస్థిరమైన సంపదను సృష్టించుకోవచ్చు. అనిల్ కుమార్ విషయంలో అదృష్టం పలకరిచినా, లాటరీ అనేది ఎప్పుడూ ఒక ప్రమాదకరమైన ఆట అని, అదృష్టం అరుదుగా మాత్రమే తలుపు తడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


