Young Man Death:దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరుగుతున్న తరుణంలో, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 30 ఏళ్ల వయసున్న ఒక యువకుడు జ్యూస్ తాగుతూ ఉండగానే గుండెపోటుకు గురై క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
ఉద్యోగం చేస్తూ..
ఖమ్మం జిల్లా పల్లెపాడు ప్రాంతానికి చెందిన ఏకలవ్య అనే యువకుడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో తన మిత్రుడితో నివసిస్తున్నాడు. అక్కడే ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న అతడు, బుధవారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి సమీపంలోని జ్యూస్ సెంటర్‌కి వెళ్లాడు. జ్యూస్ తాగుతూ నిలబడి ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Also Read:https://teluguprabha.net/viral/blinkit-delivery-agent-uses-mahindra-thar-video-goes-viral/
పరిసరాల్లో ఉన్న వారు ఈ దృశ్యాన్ని చూసి వెంటనే స్పందించారు. శ్వాస ఆగిపోకుండా సీపీఆర్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తమ వాహనంలోనే అతన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఏకలవ్య చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.
ఆరోగ్య సమస్యలు..
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, ఏకలవ్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. గతంలో హృదయానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోలేదని తెలిసింది. ఇంత తక్కువ వయసులోనే ఇలాంటి ఆకస్మిక మరణం జరగడం అందరికీ షాక్‌కు గురిచేసింది. జ్యూస్ సెంటర్ బయట జరిగిన ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.
Also Read: https://teluguprabha.net/career-news/telangana-green-energy-policy-to-generate-20000-mw-and-jobs/
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురికి తరలించారు. ఏకలవ్య కుటుంబానికి ఈ వార్త తెలిసిన వెంటనే కన్నీళ్లు ఆగలేదు. ఊహించని ఈ పరిస్థితి వారిని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.


