మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్న పోరాటానికి సన్నద్ధం కావాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళగా మనం సహచర మహిళలకు ఏం చేస్తున్నామన్నది ముఖ్యమని, సాటి మహిళలకు ఏదైనా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు కవిత.
తనకన్నా ముందున్నతరంలో మహిళలు స్వతంత్రం కోసం పోరాటం చేశారని, తన తరంలో మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఆ తర్వాత ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాటానికి సన్నద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ పోరాటాన్ని తన ముందుకు తీసుకెళ్తున్నానని స్పష్టం చేశారు. భవిష్యత్తు మహిళా తరానికి మీరు ఏమి చేస్తారు ఆలోచించాలని సూచించారు.
సమానమైన వేతనాల కోసం ఆడపిల్లలు డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. మహిళా విద్యార్థులు ఆయా కంపెనీలు వచ్చే జీతాలను అధ్యయనం చేయాలని, పురుషులకు ఇచ్చే జీతాలతో సమానంగా తమకు ఇవ్వాలని డిమాండ్ చేయాలని అన్నారు. మార్పు ఇక్కడి నుంచి మొదలు కావాలని అన్నారు. “ఆడపిల్లలు స్మార్ట్ గా ఉండడమే కాదు స్మార్ట్ ఫోన్ లా ఉండాలి. జీవితంలోకి ఎవరు కావాలో వాళ్ళని రానివ్వాలి. నెగటివ్ వ్యక్తులను రానివ్వకూడదు. అందరూ చెప్పినది ఓపికగా వినాలి. కానీ మన మనసు ఏది చెప్తే అదే చేయాలి.” అని కవిత వ్యాఖ్యానించారు.