Local body elections: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఎన్నికలను మొత్తం ఐదు దశల్లో నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలకు మూడు, ఎంపీటీసీతో పాటుగా జడ్పీటీసీలకు రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని దశల్లో జరిగే ఎన్నికల నిర్వహణ కోసం రూ. 350 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అయితే ఇప్పటికే రూ. 3.08 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,67,03,168 మంది గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. వీరిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 85,36,770 మంది కాగా.. 81,65,894 మంది పురుషులు మరియు 504 మంది ఇతరులు ఉన్నారు.
ఎన్నికలు జరిగే స్థానాలు, విధానం: రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటు 565 ఎంపీపీ (మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు), 31 జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాలకు పరోక్షంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం పంచాయతీల్లో 1,248 వందశాతం ఎస్టీ జనాభా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.1,289 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్నవి తెలిపారు. 10,223 ఇతర ప్రాంతాల్లోనివి ఉన్నాయని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 11 గుర్తింపు పొందిన పార్టీలు, 31 నమోదు పార్టీలు తమ గుర్తులతో పోటీ చేయనుండగా.. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-local-elections-bc-reservation-go-released/
పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం 31,377 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో 8,123 సమస్యాత్మకమైనవికాగా.. 8,113 అతి సున్నిత, 515 అత్యంత సున్నితమైన కేంద్రాలుగా గుర్తించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే 1,12,720 పోలింగ్ కేంద్రాల్లో 19,774 సమస్యాత్మకం, 21,093 అతి సున్నిత, 2,324 అత్యంత సున్నితమైన కేంద్రాలుగా ఉన్నాయి. ఎన్నికల కోసం మొత్తం 1,72,916 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం కాగా ప్రస్తుతం 1,18,547 బాక్స్‌లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సిబ్బంది: ఎన్నికల నిర్వహణలో భారీ స్థాయిలో సిబ్బంది పాల్గొననున్నారు. ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికలకు 651 మంది ఆర్వోలు (జడ్పీటీసీ), 2,337 మంది ఆర్వోలు (ఎంపీటీసీ), 2,340 మంది ఏఆర్‌వోలు, 39,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,58,725 మంది ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు 4,956 మంది ఆర్వోలు మొదటి దశకు, 14,407 మంది ఆర్వోలు రెండో దశకు విధులు నిర్వహిస్తారు. అంతే కాకుండా 79,798 మంది ప్రిసైడింగ్ అధికారులు 1,03,318 మంది ఇతర సిబ్బంది పాల్గొననున్నారు.


