7-7-7 parenting technique: ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలతో గడిపేందుకు సమయం చిక్కడం లేదా? ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కూడా పని ఒత్తిడి, ఫోన్ కాల్స్‌తోనే గడిచిపోతోందా? మీ పిల్లలు చెప్పేది వినే ఓపిక ఉండటం లేదా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ‘అవును’ అయితే.. మీరు మీ పిల్లల ప్రపంచానికి దూరమవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దూరాన్ని చెరిపేసి, మీ బంధాన్ని పటిష్టం చేసేందుకు మనస్తత్వవేత్తలు ఒక సులువైన ‘7-7-7’ ఫార్ములాను సూచిస్తున్నారు.
ఎందుకీ అవసరం :
ఎదిగే వయసులో పిల్లలకు తల్లిదండ్రుల సమయం, ఆప్యాయత ఎంతో అవసరం. కానీ, నేటి పోటీ ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక అలసట, చిరాకుతో ఉంటున్నారు. దీంతో పిల్లలు తమ మనసులోని మాటను, పాఠశాలలో జరిగిన విశేషాలను, తమ ఇబ్బందులను పంచుకోవడానికి జంకుతున్నారు. అమ్మానాన్న ఎలా స్పందిస్తారోన్న భయంతో తమలోనే దాచుకుని ఒంటరితనానికి గురవుతున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ను పూడ్చడానికే ఈ ‘ట్రిపుల్ సెవెన్’ సూత్రం.
Also Read: https://teluguprabha.net/lifestyle/eat-these-healthy-food-for-stress-relief/
ఏమిటీ 7-7-7 సూత్రం?
ఈ సూత్రం చాలా సులభం. రోజులో మూడు కీలక సమయాల్లో, ప్రతిసారీ కేవలం 7 నిమిషాల పాటు మీ పూర్తి శ్రద్ధను పిల్లలపై కేంద్రీకరించాలి. ఆ సమయంలో ఫోన్లు, టీవీ, ల్యాప్‌టాప్‌లను పూర్తిగా పక్కన పెట్టేయాలి.
ఉదయం 7 నిమిషాలు (రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు): నిద్ర లేవగానే పిల్లలను ప్రేమగా పలకరించండి. ఆ రోజు ప్రణాళికల గురించి మాట్లాడండి. వారితో కలిసి బాల్కనీలోని మొక్కలకు నీళ్లు పోయడం, చిన్నపాటి వ్యాయామం చేయడం, లేదా సరదాగా ఓ పాట పాడుకోవడం వంటివి చేయండి. ఈ ఏడు నిమిషాల సానుకూల ప్రారంభం, వారిని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
సాయంత్రం 7 నిమిషాలు (రోజును పంచుకునేందుకు): పిల్లలు స్కూల్ నుంచి, మీరు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక ఈ సమయం కేటాయించాలి. “ఈరోజు స్కూల్‌లో ఏం జరిగింది?”, “ఫ్రెండ్స్‌తో ఎలా గడిచింది?”, “ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?” అంటూ ఆసక్తిగా అడగండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. వారి విజయాలను మెచ్చుకోండి, ఇబ్బందులకు భరోసా ఇవ్వండి. ఇది వారికి “నన్ను పట్టించుకునే వారున్నారు” అనే నమ్మకాన్ని ఇస్తుంది.
రాత్రి 7 నిమిషాలు (భద్రత భరోసా ఇచ్చేందుకు): పిల్లలు నిద్రపోయే ముందు ఈ ఏడు నిమిషాలు అద్భుతాలు చేస్తాయి. వారికి మంచి నీతి కథలు చెప్పండి. రోజులో వారు చేసిన మంచి పనులను ప్రస్తావించి ప్రోత్సహించండి. ప్రేమగా వారిని కౌగిలించుకుని, తల నిమరండి. ఇది వారిలో సురక్షితమైన భావనను పెంపొందించి, ప్రశాంతమైన నిద్రకు ఉపకరిస్తుంది. ఈ చిన్న సూత్రాన్ని పాటిస్తే చాలు, మీ పిల్లలతో మీ బంధం కొత్త పుంతలు తొక్కడం ఖాయమని మనస్తత్వ నిపుణులు భరోసా ఇస్తున్నారు.


