కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. అయితే విచారణకు అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ గైర్హాజరయ్యారు. దీంతో తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు అన్నింటిని కలిపి సుప్రీంకోర్టు గతంలో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నుంచి సమాచారం కోసం మరింత సమయం కావాలని ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని.. ఇంకెంత గడువు కావాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే.వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అనంతరం విచారణను నేటికి వాయిదా వేసింది.