తెలంగాణలో కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అలాగే వడగాళ్లు, గాలి తీవ్రతకు వృక్షాలు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. హైదరాబాద్‌లోనూ అర్థరాత్రి పూట ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసానికి సమీపంలో ఓ పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
మాదాపూర్ మెట్రో సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్ ఎలివేషన్ పనుల కోసం నిర్మించిన సపోర్ట్ ఐరన్ రాడ్స్ కుప్పకూలాయి. ఈ ఘటన సీఎం నివాసానికి కూతవేటు దూరంలో జరిగింది. కూలిపోయిన ఐరన్ రాడ్లు రోడ్డుకు ఇరువైపులా పడిపోయాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన ఐరన్ రాడ్లను తొలగించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పగటి పూట కాకుండా అర్థరాత్రి పూట ఈ ప్రమాదం జరిగడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.