తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) మాట్లాడుతూ.. మంత్రి సీతక్కకు ఇంగ్లీష్, హిందీ రాదని, తనకు తెలుగు రాదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి(Akunuri Murali) ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
“మంత్రి గారికి హిందీ రాదు సరే, మరి నీకు తెలుగు ఎందుకు రాదు బాబు? హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినవు కదా. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార భాషా తెలుగు నేర్చుకోవాలనే సామాజిక బాధ్యత నీకు ఉండాలి కదా. అసెంబ్లీలో అందరు సభ్యులు, మంత్రులు తెలుగులోనే మాట్లాడుతున్నప్పుడు నీకు ఏం అర్థమవుతుంది. ఏదో ఒకటి అసెంబ్లీలో ప్రసంగం దంచేసి వెళ్లిపోతే సరిపోతుందా.? తెలుగు రాకపోతే రాష్ట్రంలోని సమస్యలు మీకెలా అర్థమవుతాయి. హిందీ, ఇంగ్లీష్ రాకపోతే నీకు అంత చిన్నచూపా? పొగరు కాకపోతే” అంటూ చురకలు అంటించారు.