తెలంగాణలోని ఆసుపత్రుల్లో ఇవాళ ఉదయం నుంచి ఆరోగ్య శ్రీ(Aarogyasri) సేవలు నిలిపోయాయి. ప్రభుత్వం నుంచి రూ.1000 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమై ఆరోగ్య శ్రీ నిధుల విడుదలపై చర్చించారు. అయితే ఇప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసినట్లు ఆసుపత్రుల యజమాన్యం ప్రకటించింది.
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం కోసం లక్షలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి రోగులకు ఆరోగ్య శ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం బకాయిలతో సేవలు నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.