Aarogyasri Treatment Services To Be Closed From Midnight: రాష్ట్రంలో మంగళవారం అర్థరాత్రి నుంచి రాజీవ్ ‘ఆరోగ్యశ్రీ’ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారంపై ఎన్నిసార్లు సమీక్షలు జరిపినా.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్‌హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వడ్డిరాజు రాకేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 20 రోజులుగా ఆరోగ్యశాఖ మంత్రి, ఏహెచ్‌సీటీ సీఈఓతో తాము తరచూ సమావేశాలు నిర్వహించినప్పటికీ పరిష్కారం కొలిక్కి రాలేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బకాయిల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిష్కారం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 16 అర్థరాత్రి 11:59 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు, రోగులు తమ సమస్యను అర్థం చేసుకొని మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రోగులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, తమ సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పదని టీఏఎన్‌హెచ్ఏ అధ్యక్షుడు స్పష్టం చేశారు.
Read Also: https://teluguprabha.net/business/subsidy-on-electric-two-wheelers/
రూ. 1000 కోట్లకు పైగా బకాయిలు..
కాగా, గత కొంత కాలంగా ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్) కింద అందిస్తున్న సేవలకుగాను ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగకపోవడంతో సుమారు రూ.1000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో దవాఖానల నిర్వహణ కష్టంగా మారిందని ఆసుపత్రుల సంఘం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 471 ప్రైవేటు హాస్పిటళ్లు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాకేశ్ తెలిపారు. మరోవైపు, ప్యాకేజీల సవరణ, క్రమం తప్పకుండా బకాయిల చెల్లింపు, ఒప్పందాల పునరుద్ధరణ వంటి హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఆయా హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున బకాయిల పేరుకుపోవడంతో చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని స్పష్టం చేశారు. నిధులు లేకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని, ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల కొన్ని ఆసుపత్రులు మూసివేసే పరిస్థితి కూడా ఏర్పడిందని తెలిపారు. అయితే, ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు పొందుతున్న వేలాది మంది రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందకుండా పోతుంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి, బకాయిలను చెల్లించి, ప్రజలకు వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు, రోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


