ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ-రేసింగ్ (Formula E racing) అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విచారణ చేపట్టింది. రెగ్యులర్ ఎంక్వైరీ మొదలుపెట్టిన ఏసీబీ.. ఫైళ్ల పరిశీలన, అక్రమాలపై దృష్టి సారించింది. ఏసీబీ ఇప్పటికే ఫార్ములా ఈ-రేసింగ్‌కు సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు గుర్తించింది. మున్సిపల్ శాఖ వద్ద రికార్డుల ఆధారంగా త్వరలో విదేశీ సంస్థలు, ప్రతినిధులకు నోటీసులు కూడా ఇవ్వనుంది. ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వంలోని పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఫార్ములా ఈ కార్ల రేసింగ్ (Formula E racing) వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. లేఖపై సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ సర్కార్.. విచారణకు అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ ప్రారంభమైంది. విచారణలో భాగంగా అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
కేటీఆర్ టార్గెట్…
కేటీఆర్ టార్గెట్ గా ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఉచ్చు బిగుస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేటీఆర్ మౌఖిక ఆదేశాలతో ఆర్ధిక శాఖ అనుమతి లేకుండానే ఈ – కార్ల రేసింగ్ నిర్వహణ సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) కి అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ రూ . 55 కోట్లు చెల్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే రుజువైతే కేటీఆర్ పై సర్కార్ చర్యలకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.