ఫార్ములా ఈ-రేస్(Formula E-Race)కేసు విచారణలో భాగంగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ(ACB) కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వచ్చిన సంగతి తెలిసిందే. అయితే విచారణకు కేటీఆర్ తనతో పాటు లాయర్లను తీసుకొచ్చారు. దీంతో లాయర్లను పోలీసులు ఆఫీసు ముందే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తన లాయర్లను లోపలికి అనుమతిస్తేనే విచారణకు వస్తానని చెప్పారు. ఎంతకీ వారిని అనుమతించకపోవడంతో అక్కడి నుంచి ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఏసీబీ నోటీసులపై వివరణ ఇస్తూ లేఖ రాశారు. హైకోర్టు తీర్పు వచ్చేంతవరకు విచారణ ఆపాలని కేటీఆర్ కోరారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. కేటీఆర్ ఇచ్చిన వివరణపై లీగల్ టీంతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పినందున మళ్లీ పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు చెప్పినా కూడా కేటీఆర్ విచారణకు రాకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. కేటీఆర్ దర్యాప్తునకు సహకరించడం లేదని న్యాయస్థానం ముందు ప్రస్తావించనున్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.