శబరిమల(Sabarimala)లో హైదరాబాద్(Hyderabad) ఉప్పరిగూడకి చెందిన అయ్యప్పస్వాములు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. కేరళలోని కొట్టాయం కనమల అట్టివల వద్ద బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాజు స్పాట్‌లోనే మృతి చెందాడు. బస్సులో ఉన్న 8 మంది తీవ్రంగా గాయపడగా.. మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ దుర్ఘటన గురించి తెలియగానే కొట్టాయం జిల్లా కలెక్టర్‌తో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. చికిత్స అనంతరం అయ్యప్ప స్వాములకు స్పెషల్ దర్శనం చేయించేలా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి ఉచితంగా అంబులెన్సులో హైదరాబాద్ కి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్‌కు అయ్యప్పస్వాములు ధన్యవాదాలు తెలియజేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. తమకు మెరుగైన చికిత్స అందించేలా చేయడంతో పాటు స్పెషల్ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయడంతో ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు.