కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పలువురు నటీనటులు విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, బాలీవుడ్ నటి దియా మీర్జా, నటుడు జాన్ అబ్రహం, పలువురు తెలుగు నటులు కూడా ఈ విషయంపై స్పందించారు. 400 ఎకరాలను కాపాడాలని కోరారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) కూడా స్పందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“సీఎం రేవంత్ రెడ్డి గారు కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పున:పరిశీలించాలని నేను వేడుకుంటున్నా. ఇది అభయారణ్యమే కాదు… మన హైదరాబాద్ నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ” అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు.
కాగా ఊర్వశీ రౌతేలా ఇటీవల సంక్రాంతికి విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’లో కీలక పాత్రలో నటించిన విషయం విధితమే. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’తో పాటు మరికొన్ని సినిమాల్లోని ఐటెం పాటల్లో ఆడిపాడారు.