అదానీతో ఢిల్లీలో దోస్తీ.. తెలంగాణలో కుస్తీ అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. ధర్నాల పేరుతో రోడ్లపై సర్కస్ ఫీట్లు చేస్తున్న రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అదానీకి రెడ్ కార్పెట్ వేసి తెలంగాణ పరువును మంటకలిపారన్నారు. గురువారం అసెంబ్లీలో అదానీ, రేవంత్ రెడ్డి సంబంధంపై చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వివిధ సంస్థల ఏర్పాటు కోసం అదానీతో రూ.12,400 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నారని చెప్పారు. రూ.100 కోట్లు ఎలా వాపస్ ఇచ్చారో.. రూ.12,400 కోట్ల ఒప్పందాలు కూడా రద్దు చేసుకుని నిజాయతీ నిరూపించుకోవాలని సూచించారు. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని.. దీని వల్ల 12 గ్రామాలు కాలుష్యమవుతున్నాయని ప్రజులు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పోలీసులను పెట్టి ఆందోళనకారులను అణచివేస్తున్నారని మండిపడ్డారు. రాజ్ భవన్ దగ్గర అదానీ గురించి కాకుండా కేసీఆర్ గురించి మాట్లాడటం విడ్డూరమని ఫైర్ అయ్యారు.