త్వరలోనే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో గులాబీ పార్టీ విలీనం అవ్వడం ఖాయమని చెప్పారు. తాజాగా ప్రభాకర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Addanki Dayakar) కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీపై విషయం చిమ్మడం తప్ప మరో పని లేదని విమర్శించారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9న కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాకపోతే బీజేపీని రద్దు చేసుకుంటారా? అని సవాల్ విసిరారు.
బీజేపీ, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒకటేనని ప్రజలు నమ్మి ఆ పార్టీలను ఓడించారని తెలిపారు. బీజేపీ నేతల మెదడు మోకాళ్ల నుంచి అరికాళ్లలోకి పడిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీ నుంచి గెంటేసిన సందర్భంలో కూడా ఇంతలా మాట్లాడని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.. పార్టీ అధ్యక్ష పదవి కోసమే సీఎం రేవంత్ రెడ్డిపై దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు తలకిందులు తపస్సు చేసినా తెలంగాణలో అధికారం రాదని దయాకర్ జోస్యం చెప్పారు.