illegal sale of medicines without prescription : వైద్యుడి చీటీ లేకుండా మందులు కొనడం, అమ్మడం రెండూ నేరమే! కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఔషధ దుకాణాలు ఈ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల అధికారులు జరిపిన తనిఖీల్లో వెలుగు చూసిన ఈ నిర్లక్ష్యం వెనుక ఉన్న వాస్తవాలేంటి..? ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట పడేదెప్పుడు?
ఆదిలాబాద్ జిల్లాలో ఔషధ దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు పాతర వేస్తున్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే తీవ్ర ప్రభావం చూపే మందులను సైతం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ రాజర్షి షా, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆడె శ్రీలత జరిపిన తనిఖీల్లో ఈ బరితెగింపు బట్టబయలైంది. గతంలో గుడిహత్నూర్‌లో గర్భస్రావ మాత్రలతో బాలికకు అబార్షన్ చేయడం, ఆదిలాబాద్ పట్టణంలో మత్తు ఇంజక్షన్లు విక్రయించడం వంటి ఘటనలు మరవక ముందే, మళ్లీ అదే తరహా ఉల్లంఘనలు వెలుగు చూడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తనిఖీల్లో బయటపడ్డ నిర్వాకం..
ఫార్మాసిస్ట్ లేడు.. పర్యవేక్షణ లేదు: నిబంధనల ప్రకారం ప్రతి మందుల దుకాణంలో అర్హత పొందిన ఫార్మాసిస్ట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ, రిమ్స్‌లోని ఒక జీవన్‌ధార దుకాణంలో కనీసం ఫార్మాసిస్ట్ లేకుండానే అమ్మకాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. తెల్ల కాగితాలపై రాసుకొచ్చిన మందులను సైతం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ముందే అమ్మేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
యాంటీబయాటిక్స్‌తో ఆటలు: యాంటీబయాటిక్ మందుల అమ్మకాలకు సంబంధించిన హెచ్-1 రిజిస్టర్‌ను చాలా దుకాణాలు నిర్వహించడం లేదు. వైద్యుడి సలహా లేకుండా అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వాడటం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని తెలిసినా, నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
అద్దె సర్టిఫికెట్లతో దందా: కొందరు ఇతరుల ఫార్మసీ సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని, ఎటువంటి అర్హత లేకుండానే మెడికల్ షాపులను నిర్వహిస్తున్నారు.
నోటిమాటతో అమ్మకాలు: నొప్పుల నివారణ మాత్రలు, ఇతర షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను కూడా ఎలాంటి చీటీ లేకుండా నోటిమాటతోనే విక్రయిస్తున్నారు. అర్హత లేని వైద్యులు రాసిన చీటీలతో మందులు ఇవ్వడం, జీఎస్‌టీ, కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వకపోవడం వంటి ఉల్లంఘనలు సర్వసాధారణంగా మారాయి.
అధికారుల కొరడా: ఈ ఏడాది జనవరి నుంచి జరిపిన తనిఖీల్లో సుమారు 94 దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఇటీవల ఓ దుకాణంలో గడువు తీరిన బీపీ మాత్రలు విక్రయించినందుకు, ఆ దుకాణాన్ని 10 రోజుల పాటు మూసివేయించి నోటీసులు జారీ చేశారు.
“ఔషధ దుకాణాల వారు విధిగా నిబంధనలు పాటించాలి. క్రయ, విక్రయాల రిజిస్టర్‌లను నిర్వహిస్తూ, వినియోగదారులకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు, కేసులు నమోదు చేయడానికి వెనుకాడం,” అని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆడె శ్రీలత హెచ్చరించారు.


