Saturday, November 15, 2025
HomeతెలంగాణCrisis at Adilabad RIMS: రిమ్స్‌లో రోదన.. పసికందుల ప్రాణాలతో చెలగాటం!

Crisis at Adilabad RIMS: రిమ్స్‌లో రోదన.. పసికందుల ప్రాణాలతో చెలగాటం!

Adilabad RIMS hospital crisis : పుట్టిన పసికందుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలవాల్సిన ఓ సర్కారీ దవాఖానానే నేడు అనారోగ్యంతో మూలుగుతోంది. నిధుల కొరత అనే మహమ్మారి సోకి, అత్యవసర మందులకే అప్పు చేయాల్సిన దుస్థితికి చేరింది. పసిపిల్లల ఆకలి తీర్చే పాలపొడికి సైతం దిక్కులేక, సిబ్బందే అరువుకు తెచ్చి పాలు పడుతున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ (రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలోని నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (SNCU)లో నెలకొన్న ఈ దయనీయ పరిస్థితిపై ప్రత్యేక కథనం. అసలు ఈ దుస్థితికి కారణమేంటి..? పాలకుల నిర్లక్ష్యం పసికందుల ప్రాణాలను ఎలా బలితీసుకుంటోంది..?

- Advertisement -

అరకొర వసతులు.. అప్పు తెస్తేనే వైద్యం : తక్కువ బరువుతో, శ్వాస సంబంధిత సమస్యలతో జన్మించిన పసికందులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిందే SNCU విభాగం. కానీ, ఇక్కడ పరిస్థితి పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది.

నిధుల సున్నా: ఈ విభాగానికి జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద ఏటా రూ.15 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉండగా, గత రెండేళ్లుగా అరకొర నిధులే అందాయి. 2024లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. గతేడాది బకాయిలే ఇంకా రూ.6 లక్షలు పేరుకుపోయాయి.

అరువు మందులు: నిధులు లేకపోవడంతో, సిబ్బంది అత్యవసర మందులు, శిశువుల పాలపొడి, డైపర్లను సైతం ఏజెన్సీలను బతిమాలి అరువుపై తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ప్రాణవాయువుకు కటకట: శ్వాస సమస్యలున్న శిశువులకు చికిత్స అందించేందుకు కీలకమైన సీ-ప్యాప్ (CPAP) యంత్రాలు అవసరమైనన్ని లేవు. ఉన్నవి అరకొరే.

“ఎన్‌హెచ్‌ఎం నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ప్రభుత్వం త్వరలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.”
– రాఠోడ్ నరేందర్, డీఎంహెచ్‌ఓ, ఆదిలాబాద్

బూజు పట్టిన గదులు.. ఉక్కపోతలో తల్లులు : వైద్యం సంగతి పక్కన పెడితే, ఆసుపత్రిలోని వాతావరణం మరింత భయానకంగా ఉంది. SNCU విభాగంలో చికిత్స పొందుతున్న పసికందుల తల్లులు సేదతీరడానికి ఏర్పాటు చేసిన గది అధ్వాన్నంగా తయారైంది. పైకప్పు నుంచి వర్షపు నీరు కారి, గోడలన్నీ పాకురు పట్టి, బూజుతో నిండిపోయాయి. కనీసం ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో తల్లులు, పసిపిల్లలు ఉక్కపోతతో నరకం అనుభవిస్తున్నారు. “ప్రైవేటుకు వెళ్లే స్థోమత లేక ఇక్కడికి వస్తే, ఉన్న రోగం పోయి కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయి. అధికారులు పట్టించుకోవాలి,” అని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్థోమత లేక, ప్రభుత్వ వైద్యాన్ని నమ్ముకుని వచ్చే పేదలకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు చిట్టీ రాసినా, అందులో రెండు, మూడు మందులు మాత్రమే ఆసుపత్రిలో లభిస్తున్నాయని, మిగతావి బయట కొనుక్కోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి, రిమ్స్‌కు జీవం పోయకపోతే, మరెందరో పసికందుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad