Agniveer recruitment rally Telangana : భారత సైన్యంలో చేరాలి, దేశ సరిహద్దుల్లో పహారా కాయాలి, త్రివర్ణ పతాకం నీడలో దేశానికి సేవ చేయాలి… ప్రతీ యువకుడి గుండెల్లో మెదిలే ఓ ఉద్వేగభరితమైన కల ఇది. ఆ కలను సాకారం చేసుకునే సువర్ణావకాశం ఇప్పుడు తెలంగాణ యువత తలుపు తడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అగ్నివీర్’ పథకం ద్వారా సైన్యంలో చేరేందుకు హనుమకొండ ప్రాంగణం సిద్ధమైంది. కేవలం 8వ, 10వ తరగతి విద్యార్హతతోనే దేశసేవ చేసే భాగ్యాన్ని అందుకునే ఈ ర్యాలీలో విజేతగా నిలవాలంటే ఏం చేయాలి? శారీరక పరీక్షల్లో నెగ్గడానికి పాటించాల్సిన మెలకువలేంటి? ఏయే పత్రాలు సిద్ధం చేసుకోవాలి? ఆ క్షణంలో ఒత్తిడిని ఎలా జయించాలి? తెలుసుకోవాలంటే చదవండి.
దేశ సేవ చేయాలనుకునే యువతకు భారత సైన్యం గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ‘అగ్నివీర్’ పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (JNS) వేదికగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన అర్హులైన యువకులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.
ఎంపిక ప్రక్రియ.. పోస్టుల వివరాలు : ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా పలు విభాగాల్లో అగ్నివీరులను ఎంపిక చేయనున్నారు. ప్రధానంగా కింది పోస్టులను భర్తీ చేయనున్నారు:
అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD)
అగ్నివీర్ టెక్నికల్
అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్
అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్
విజేతగా నిలవాలంటే.. అనుభవజ్ఞుల సలహా : కేవలం ఆసక్తి ఉంటే సరిపోదు, సరైన ప్రణాళిక, సన్నద్ధత ఉంటేనే విజయం వరిస్తుందని మిర్యాలగూడకు చెందిన సైనిక ఉద్యోగి మేకా రవికిరణ్ వంటి అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. అభ్యర్థులు ప్రధానంగా ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలి.
పత్రాలు పక్కాగా ఉండాలి: ర్యాలీకి హాజరయ్యే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అడ్మిట్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్హత, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, పాన్ కార్డ్ వంటి ఒరిజినల్ సర్టిఫికెట్లను, వాటి జిరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలి. ఏవైనా సందేహాలుంటే 040-27740059, 040-27740205 నంబర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.
శారీరక దారుఢ్యమే కీలకం: సైనిక ఎంపికలో శారీరక సామర్థ్య పరీక్ష అత్యంత కీలకమైనది. దీనికోసం నెలల ముందు నుంచే సాధన చేయాలి. ముఖ్యంగా పరుగు, పుషప్స్, లాంగ్ జంప్ వంటి వాటిపై పట్టు సాధించాలి. రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ర్యాలీ రోజున సునాయాసంగా పరీక్షను పూర్తి చేయవచ్చు.
ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ: ర్యాలీకి ముందు రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తగినంత నిద్రపోవాలి. పరీక్ష రోజున తేలికపాటి ఆహారం తీసుకోవాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా నీరు ఎక్కువగా తాగాలి. పరుగుకు, వ్యాయామాలకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులు, బూట్లు ధరించడం ముఖ్యం.
ఆందోళన వద్దు.. ముందుగా చేరండి: ర్యాలీ జరిగే స్టేడియానికి అధికారులు సూచించిన సమయం కంటే గంట ముందే చేరుకోవాలి. దీనివల్ల చివరి నిమిషంలో హడావుడి, ఆందోళన తగ్గుతాయి. అధికారులు ఇచ్చే సూచనలను ప్రశాంతంగా వినడానికి, అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. పరీక్ష సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పాల్గొనాలి.
నాలుగేళ్ల సేవ.. భవిష్యత్తుకు భరోసా : అగ్నివీర్‌గా ఎంపికైన వారికి నాలుగేళ్ల సర్వీసు కాలంలో ఆకర్షణీయమైన వేతనంతో పాటు, భవిష్యత్తుకు భరోసా కల్పించే ‘సేవానిధి’ ప్యాకేజీ లభిస్తుంది.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం అందుతుంది.
సేవానిధి ప్యాకేజీ: ప్రతి నెల జీతంలో 30% కార్పస్ ఫండ్‌కు జమ అవుతుంది. నాలుగేళ్లలో అగ్నివీరుని వాటా రూ.5.02 లక్షలు కాగా, అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. సర్వీస్ పూర్తయ్యేనాటికి రెండూ కలిసి రూ.10.04 లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ కూడా కలిపి అగ్నివీరునికి అందజేస్తారు. ఇది వారి తదుపరి చదువులకు లేదా ఉపాధికి ఎంతగానో ఉపయోగపడుతుంది.


