Saturday, November 15, 2025
HomeతెలంగాణAgri-tourism : పల్లెకు 'పర్యాటక' శోభ.. పొలమే విడిది.. రైతు ఇల్లే బస!

Agri-tourism : పల్లెకు ‘పర్యాటక’ శోభ.. పొలమే విడిది.. రైతు ఇల్లే బస!

Agri-tourism in India : ఎడ్ల బండిపై షికారు.. పచ్చని పొలాల్లో నడక.. కోడి కూతతో నిద్రలేవడం.. మట్టి వాసనను ఆస్వాదిస్తూ, రైతుతో కలిసి పొలం పనులు చేయడం.. ఇదంతా ఏదో సినిమాలోని దృశ్యం కాదు. నగర కాలుష్యానికి, ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా, ప్రశాంతతను కోరుకునే వారికి ‘వ్యవసాయ పర్యాటకం’ (అగ్రి-టూరిజం) అందిస్తున్న అద్భుతమైన అనుభూతి. అసలు ఏమిటీ అగ్రి-టూరిజం..? దీని ద్వారా పల్లె జీవితాన్ని ఎలా ఆస్వాదించవచ్చు? మన తెలుగు రాష్ట్రాల్లో ఈ అవకాశం ఎక్కడెక్కడ ఉంది?

- Advertisement -

ఏమిటీ ‘అగ్రి-టూరిజం’ : నిజమైన పల్లె జీవితాన్ని, వ్యవసాయ సంస్కృతిని నగరవాసులకు, విదేశీయులకు పరిచయం చేయడమే అగ్రి-టూరిజం. పర్యాటకులు గ్రామాలకు వెళ్లి, రైతుల ఇళ్లల్లోనే బస చేసి, వారి జీవన విధానంలో మమేకమవుతారు. ఈ వినూత్న పర్యాటక విధానాన్ని ప్రోత్సహించేందుకు, కేంద్ర ప్రభుత్వం 2005లోనే ‘అగ్రి-టూరిజం ఇండియా’ సంస్థను ఏర్పాటు చేసింది.

దేశవ్యాప్తంగా విస్తరణ.. కోటి మంది పర్యాటకులు : మహారాష్ట్రలోని పల్షివాడి అనే చిన్న గ్రామంలో మొదలైన ఈ ప్రయోగం, నేడు దేశవ్యాప్తంగా 6,700 గ్రామాలకు విస్తరించింది. ఇప్పటివరకు కోటి మందికి పైగా పర్యాటకులు ఈ పల్లె అందాలను ఆస్వాదించారు.

పర్యాటకులు ఏం చేస్తారంటే : రైతులతో కలిసి పొలం దున్నడం, కలుపు తీయడం, పంట కోయడం వంటి పనుల్లో పాల్గొంటారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై గ్రామమంతా విహరిస్తారు.
పండ్ల తోటల్లోకి వెళ్లి, స్వయంగా పండ్లు కోసుకుని తింటారు. స్థానిక వంటకాలను రుచి చూస్తారు, చేతివృత్తులను పరిశీలిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలెక్కడ : అధికారికంగా పర్యాటక శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకపోయినా, సొంతంగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లగలిగే ప్రాంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి.

తెలంగాణ: రంగారెడ్డి ద్రాక్షతోటలు, ఆదిలాబాద్ పత్తి చేలు, నల్గొండ బత్తాయి తోటలు, జగిత్యాల మామిడి వనాలు, ఖమ్మం పామాయిల్ తోటలు.
ఆంధ్రప్రదేశ్: కోనసీమ కొబ్బరి, అరటి తోటలు, మదనపల్లె టమాట క్షేత్రాలు, అరకు అటవీ వ్యవసాయం, కడియం పూలతోటలు.

ఉత్తమ పర్యాటక గ్రామాలు : ఈ ఏడాది (2025) ఉత్తమ వ్యవసాయ పర్యాటక గ్రామాలుగా కేరళలోని కుమరకోం, మహారాష్ట్రలోని కర్డె, పంజాబ్‌లోని హన్సాలి వంటివి ఎంపికయ్యాయి. ఈ గ్రామాలు, అగ్రి-టూరిజం ద్వారా స్థానిక రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా, మన వ్యవసాయ వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad