Thursday, December 11, 2025
HomeతెలంగాణRisks of AI: మేధస్సుకు కృత్రిమ మేధ ముప్పు... ఆలోచనకు అడ్డుకట్ట వేస్తున్న ఏఐ!

Risks of AI: మేధస్సుకు కృత్రిమ మేధ ముప్పు… ఆలోచనకు అడ్డుకట్ట వేస్తున్న ఏఐ!

Dangers of AI overuse : మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లోంచి మన మెదడులోకి పాకిన ఓ సాంకేతిక విప్లవం పేరు ‘కృత్రిమ మేధ’ (AI). బడి పిల్లల ప్రాజెక్టు వర్క్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర్వుల వరకు, అన్ని రంగాల్లోనూ ఏఐ తనదైన ముద్ర వేస్తోంది. క్షణాల్లో పనులు చక్కబెడుతున్న ఈ టెక్నాలజీ ఓ వరంలా కనిపిస్తున్నా, దాని నీడలో ఓ పెను శాపం దాగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

- Advertisement -

సమాచార, సాంకేతిక రంగాల్లో కృత్రిమ మేధ ఓ ప్రభంజనం. ఒకప్పుడు గంటల తరబడి చేయాల్సిన పనులను ఇప్పుడు నిమిషాల్లో పూర్తి చేస్తోంది. కానీ, ఈ సౌలభ్యం వెనుక ఉన్న చేదు నిజం, మానవ మేధస్సు నెమ్మదిగా మసకబారడం.

క్షణాల్లో పనులు.. ప్రశ్నార్థకమైన మేధస్సు!

ఉదంతం 1 – విద్యార్థి నైపుణ్యం: కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి, తను చేసిన ప్రాజెక్టు వర్క్‌ను లెక్చరర్లకు చూపించాడు. అందులో ఒక్క తప్పు కూడా లేకపోవడం, అద్భుతమైన పదజాలం ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. అనుమానం వచ్చి ఆ విద్యార్థిని నిలదీయగా, “సార్, నేను ఈ ప్రాజెక్టు చేయడానికి ఏఐ అప్లికేషన్‌ను ఉపయోగించాను” అని నిజాయతీగా ఒప్పుకున్నాడు.

ఉదంతం 2 – ఉద్యోగి వేగం: ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నతాధికారి తన కంప్యూటర్ ఆపరేటర్‌ను పిలిచి, అత్యవసరంగా ఒక ముఖ్యమైన ఉత్తరం డ్రాఫ్ట్ చేసి, నోట్ ఫైల్‌ను సిద్ధం చేయమని ఆదేశించారు. ఆశ్చర్యకరంగా, ఆ ఆపరేటర్ కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎలాంటి తప్పులు లేకుండా ఫైల్‌ను అధికారి ముందు ఉంచాడు. అదెలా సాధ్యమని అధికారి అడగ్గా, “చాట్‌ జీపీటీ సార్! ఉత్తరం ఉద్దేశాన్ని, కొన్ని ముఖ్య పదాలను ఇవ్వగానే అదే మొత్తం డ్రాఫ్ట్ చేసింది” అని వివరించాడు.

అతి సర్వత్ర వర్జయేత్: ముంచుకొస్తున్న ముప్పు ఇదే!
పైన చెప్పినవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. విద్యార్థులు క్లిష్టమైన గణిత సమస్యలకు, హోం వర్క్‌కు పూర్తిగా ఏఐపైనే ఆధారపడుతున్నారు. ప్రశ్నను కాపీ చేసి, వచ్చిన సమాధానాన్ని పేస్ట్ చేస్తున్నారు. దీంతో తరగతి గదిలో బాగానే రాణిస్తున్నా, పరీక్షల్లో సొంతంగా ఆలోచించి జవాబులు రాయలేక చతికిలపడుతున్నారు. కేవలం విద్యార్థులే కాదు, ఉద్యోగులు, యువత.. ఇలా అన్ని వర్గాల వారూ కృత్రిమ మేధను ఉపయోగించి పనులు కానిచ్చేస్తున్నారు కానీ, సొంతంగా ఆలోచించే శక్తికి పాతర వేస్తున్నారు. చేదోడు వాదోడుగా ఉండాల్సిన సాంకేతికతకు పూర్తిగా దాసోహమైపోతున్నారు.

మిత్రుడా? శత్రువా? వాడుకోవాల్సిందిలా!
ఏఐని శత్రువుగా చూడాల్సిన పనిలేదు. దానిని ఓ మిత్రుడిగా, ఓ శక్తివంతమైన సాధనంగా మార్చుకుంటే అద్భుతాలు చేయవచ్చు. నిపుణులు సూచిస్తున్న కొన్ని మార్గాలు:
సారాంశం కోసం: క్లిష్టమైన పాఠ్యాంశాలను, పెద్ద పెద్ద వ్యాసాలను తక్కువ సమయంలో అర్థం చేసుకోవడానికి వాటి సారాంశాన్ని (Summary) తెలుసుకునేందుకు ఏఐని వాడటం ఉత్తమం.
వ్యక్తిగత సహాయకారిగా: ఏదైనా అంశం ఒక కోణంలో అర్థం కానప్పుడు, దానిని విభిన్న ఉదాహరణలతో, సులభమైన భాషలో వివరించమని ఏఐని అడగవచ్చు. ఇది వ్యక్తిగత ట్యూటర్‌లా ఉపయోగపడుతుంది.
ప్రాక్టీస్ కోసం: మనకు కావాల్సిన అంశాలపై అపరిమితమైన క్విజ్‌లు, ప్రశ్నలు తయారు చేయమని ఏఐని కోరవచ్చు. దీనివల్ల విద్యార్థులు బాగా ప్రాక్టీస్ చేసి, విషయంపై పట్టు సాధించవచ్చు.
తప్పులు సరిదిద్దుకోవడానికి: మనం సొంతంగా రాసిన కంటెంట్, వ్యాసాలను ఏఐ టూల్స్‌లో ఇచ్చి, వ్యాకరణ తప్పులు, పదాల కూర్పుపై అభిప్రాయం అడగవచ్చు. ఇది మన రచనా నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నిపుణులు ఏమంటున్నారు? “విద్యార్థులకు ఏఐ ఎప్పటికీ టీచర్‌ కాదు. మానవ మేధస్సు, సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం లేదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు బానిస కాకుండా, దానిని ఓ మిత్రుడిగా, ఓ సహాయకారిగా వాడుకోవడం నేర్చుకుంటేనే విద్యార్థులకు విషయ పరిజ్ఞానం, పరిశోధనపై జిజ్ఞాస పెరుగుతుంది,” అని మానసిక నిపుణుడు వి.శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News