AI Sensational Survey on Jubliee Hills By Election: తెలంగాణ రాజకీయం ఇప్పుడు జూబ్లీహిల్స్ చుట్టూనే తిరుగుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి ఇది బలపరీక్షలా మారింది. గెలుపోటములపై ఎవరికి వారే లెక్కులు వేసుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పడానికి మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ వాడి సర్వే చేసింది గామా అనే ఏఐ సంస్థ. డివిజన్ల వారిగా ఏ పార్టీ బలం ఎంత అనే విషయంపై స్పష్టంగా అంచనా వేసింది. మొత్తం 10 రోజులు 92 ప్రాంతాల్లో 6,532 మంది అభిప్రాయాలు ఏఐ టెక్నాలజీ వాడి సేకరించింది. ఓటు ఎవరికి వేస్తారు? ఎందుకు వేస్తున్నారు? అనే వివిధ కోణాల్లోనే ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
బలాలు, బలహీనతలపై సర్వే రిపోర్ట్..
ఓటర్లు ఇచ్చిన డేటాను ఖచ్చితంగా అనలైజ్ చేసి.. అభ్యర్థుల బలాలు, బలహీనతలు, ఓటర్లపై ప్రభావం వంటి అంశాలపై సర్వే రాబట్టింది. ఓటింగ్ శాతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉందని ఈ సర్వే అంచనా వేసింది. కాగా, జూబ్లీహిల్స్‌లో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం కంటే తక్కువగా పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతే పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైపే జూబ్లీహిల్స్ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని సర్వే తేల్చి చెప్పింది. ప్రస్తుతానికైతే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని, పోలింగ్ శాతం పెరిగితే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్‌గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో పోలింగ్ శాతం 50 దాటితే బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంచనాలు చెబుతున్నాయి. నవంబర్ 11న ఓటర్లు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటే వారంతా బీఆర్ఎస్ పార్టీవైపే ఉండే అవకాశాలు ఉన్నాయని ఏఐ సర్వేలో ఉంది. సర్వే ప్రకారం, కాంగ్రెస్ 48.50 శాతం, బీఆర్ఎస్ 45.27 శాతం, బీజేపీ 6.23శాతం ఓట్లు పొందే అవకాశం ఉంది. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఏడు డివిజన్లు ఉన్నాయి. షేక్‌పేట్, యూసఫ్‌గూడా, సోమాజిగూడ, వెంగళ్‌రావు నగర్, ఎర్రగడ్డ, రెహమత్‌నగర్, బోరబండ డివిజన్లు ఉన్నాయి. ఏ డివిజన్‌లోనూ బీజేపీ ప్రభావం కనిపించడం లేదు. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని సర్వేలో తేలింది. బస్తీల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బలం కనిపిస్తున్నది. ఏ డివిజన్‌లో ఎవరికి పట్టు ఉందో తెలుసుకుందాం.
షేక్‌పేట్
షేక్‌పేట్ డివిజన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. దాదాపు 10 శాతం ఓటర్ల నవీన్ యాదవ్‌వైపే మొగ్గుచూపుతున్నారు.
యూసఫ్‌గూడా
యూసఫ్‌గూడాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. యూసఫ్‌గూడా స్థానికుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు గట్టిపోటీ ఇస్తోంది.
సోమాజిగూడ
సోమాజిగూడలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఓటు షేరింగ్ మధ్య కేవలం ఒక శాతం మాత్రమే ఉంది. బీజేపీ ఈ డివిజన్‌లో మాత్రమే కొంతమేర ప్రభావం చూపనుంది. ఆ పార్టీ 10 శాతం ఓటింగ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. మిగిలిన ఆరు డివిజన్‌లో బీజేపీ 10 శాతం కంటే తక్కువ ఓటింగ్ సొంతం చేసుకోనుంది.
వెంగళ్‌రావు నగర్
వెంగళ్‌రావునగర్‌లో ఎక్కువగా ఏపీ సెట్టిలర్స్ ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి కారు గుర్తువైపై ఈ డివిజన్ ఓటర్లు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.
ఎర్రగడ్డ
ఎర్రగడ్డ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉండనుంది. ప్రజా సమస్యలు పరిష్కరించే వారికి ఎర్రగడ్డ ప్రజలు పట్టంకట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ నవీన్ యాదవ్‌ని చాలామంది కోరుకుంటున్నారు. ఎర్రగడ్డలోని బస్తీ వాసులు నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.
బోరబండ
బోరబండలో మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు కలిసివస్తోంది. ఇక్క బీఆర్ఎస్ క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ గతంలో చేసిన అభివృద్ధి పనులు ఓటర్లు గుర్తుంచుకున్నారు. రెండు పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి.


