Saturday, November 15, 2025
HomeతెలంగాణTG Congress: టీపీసీసీ కార్యవర్గంలో కీలక పదవులు భర్తీ

TG Congress: టీపీసీసీ కార్యవర్గంలో కీలక పదవులు భర్తీ

తెలంగాణ కాంగ్రెస్(TG Congress)పార్టీ బలోపేతంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు అసంతృప్తులపై కూడా అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన రేవంత్‌ రెడ్డి.. పలు కీలక శాఖలను ఇతర మంత్రులకు కేటాయించే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో మంత్రులకు శాఖల కేటాయింపుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక నూతనంగా మంత్రి బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్‌కు లేబర్, మైనింగ్‌, స్పోర్ట్స్ శాఖలు.. వాకిటి శ్రీహరికి న్యాయ, యూత్, పశుసంవర్థక శాఖలు లేదా మత్స్యశాఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. వీటిపై చర్చించేందుకు ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో రేవంత్ భేటీ కానున్నారు.

ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలో 96 మంది నేతలకు కీలక పదవులు అప్పగించింది. ఈమేరకు ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో 27మంది నేతలకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69మందికి ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. ఈ పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు కేటాయించింది. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చింది. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణతో పాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, బసవరాజు సారయ్యకు అవకాశం కల్పించింది. జనరల్ సెక్రెటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పర్నికారెడ్డి, మట్టా రాగమయికు ఛాన్స్ ఇచ్చింది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad