AICC Telangana Dcc Presidents Selection: అధికార కాంగ్రెస్ నేతలను ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తోన్న జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల పందేరం ఎట్టకేలకు మొదలైంది. త్వరలోనే ఈ ప్రక్రయను పూర్తి చేయనున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. త్వరలోనే డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని నిర్వహించేందుకు ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 22 మంది పరిశీలకులను నియమించింది. వారితో పార్టీ పెద్దలు రేపు (గురువారం) ఢిల్లీలో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఈ 22 మంది పరిశీలకులకు డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పీసీసీ వర్గాలు తెలిపాయి. తొలుత డీసీసీల నియామకాలకు సంబంధించి సంస్థాగత నిర్మాణ అంశాలను పరిశీలకులకు ఏఐసీసీ పెద్దలు వివరిస్తారు. దసరా అనంతరం అక్టోబర్ 4 నుంచి ఏఐసీసీ పరిశీలకులు క్షేత్ర స్థాయి పరిశీలనకు రాష్ట్రానికి రానున్నారు. దాదాపు 10 రోజుల పాటు జిల్లాల్లో పర్యటనలు చేసి ఆశావాహులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తరువాత డీసీసీ అధ్యక్షుల నియామకాల కోసం సమర్ధవంతమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సిఫారసు చేస్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, సమగ్రంగా జరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
22 మంది పరిశీలకుల నియామకం..
డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు సీరియస్‌గానే కసరత్తు చేస్తున్నారు. అన్ని నియామకాలు, నియమాలు కఠినంగా పరిశీలించి, అనవసర అడ్డంకులు లేకుండా అధ్యక్షులను ఎంపిక చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పరీక్షల తర్వాత, పరిశీలకులు జిల్లా అధ్యక్షుల ఎంపికను ముగించి, ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే తెలంగాణలోని 33 జిల్లాకు డీసీసీ అధ్యక్షులు పూర్తి స్థాయిలో నియమించబడతారు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీలో లోకల్ లెవల్ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా, కేంద్రం , రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కీలకంగా ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో డీసీసీల నియామకాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా లోకల్ నాయకత్వం యాక్టివ్‌గా పనిచేసి ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటారని, ఇది పార్టీకి లాభిస్తుందని ఏఐసీసీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా జిల్లా, మండల, గ్రామ పార్టీ అధ్యక్ష పదవుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది.


