ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పై ఎంఐఎం(MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తమ పార్టీ పూర్తి మద్ధతు ఇస్తోందని తెలిపారు. తమ హీరోయిజం చూపించుకునేందుకు ప్రజల జీవితాలతో నటులు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని పోలీసులు చెబితే.. అయితే మన సినిమా హిట్ అయిందని అల్లు అర్జున్ అన్నారని ఫైర్ అయ్యారు. ప్రపంచంలో ఇంత దుర్మార్గపు మనుషులు ఉంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా అంతకుముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓరోజు జైలుకు వెళ్లిన హీరోను మాత్రం ఇండస్ట్రీ మొత్తం పరామర్శించారని.. అతనికి ఏమైనా కాళ్లు, చేతులు, కిడ్నీలు పోయాయా అని నిలదీశారు. తల్లి చనిపోయి.. 9ఏళ్ల పిల్లవాడు ఆసుపత్రిలో ఉంటే.. సినీ ప్రముఖులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సినీ ప్రముఖులు ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే.. ప్రాణం పోయినా అరెస్ట్ చేయవద్దా..? అని ప్రశ్నించారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.