ఆ గ్రామంలో నివసించేది 1,400 వందల ఓట్ల జనాభా జనాభా. ఇందులో సగం యువకులే ఉంటారు. మూసీ నది పుట్టుకకు చేరువలో వెలిసిన ఈ గ్రామం చుట్టు ప్రశాంతమైనా పచ్చని పకృతి ఉంటుంది. గ్రామం చుట్టు వర్షాకాలం నలుమూలల వాగులు ఉదృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. కానీ ఈ పల్లెలో యువకులు పెద్దగా కనిపించరు. ఎందుకంటే వీరి బతుకు పోరాటం మొత్తం పట్నంలో కొనసాగుతుంది. పొద్దున లేచి పట్నం పయనమైతారు. తరాల నుండి ఈ గ్రామ ప్రజలు రైలు ప్రయాణం సాగిస్తున్నారు. గ్రామానికి రైలు మార్గం సమీపంలో ఉండటంతో వీరు రైల్వే ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. యువకుల్లో ఉన్నత విద్యను చదివినవారే ఎక్కువమంది ఉన్నారు. కొందరు వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే మరికొందరు డాక్టరేట్లు పొంది విదేశాలకు చేరారు. ఎక్కువ మంది తెలుగు పండిత్ ఉపాధ్యాయులు ఉన్నారు. మరికొందరు వివిధ శాఖలలో ఉద్యోగాలు చేస్తే ఇంకొందరు వ్యవసాయంతో పాటు వ్యాపారాలు చేస్తున్నారు. అందుకేనేమో అనాదిగా ఆ పల్లె కళలకు, విజ్ఞానానికి నిలయంగా మారింది. కొందరు సైన్స్ లో డాక్టరేట్ పొంది విదేశాలలో సేవలందిస్తే మరికొందరు కళా రంగంలో డాక్టరేట్ పొందారు. చిత్ర కళాకారులు, పండితులు, వ్యాపారులు, విద్యార్థులు కలగలిసి కళలను కాపాడుతూ… నేటి సమాజంలో కళలకు కేంద్రంగా నిలిచింది ఈ గ్రామం. కీర్తనలు, భజనలు, వీధి భాగవతాలు, పల్లె పల్లెల్లో భజనలు చేస్తూ…దేశ రాజధాని ఢిల్లీలో భాగవతం ప్రదర్శించి వీరు పురస్కారాలు పొందడం రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.
అందుకే ఈ పల్లెను ‘పండితుల పల్లె’గా ‘కళాకారుల పల్లె’గా చెప్పుకుంటారు. ఈ కళలకు నిలయమైన పల్లె వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం అక్నాపూర్ గ్రామం. ఇటీవల్ల హైదరాబాద్ హయత్ నగర్ లో త్రయోదశి ఆలయంలో నిర్వహించిన భజన పోటీలలో 12 టీంలు పాల్గొనగా… మొదటి బహుమతిని అక్నాపూర్ గ్రామస్తుల శ్రీ రామ లింగేశ్వర భజన మండలి అందుకున్నారు. ఈ భజన మండలిలో పసుల నర్సింలు, పసుల శేఖర్, తలారి యాదయ్య, డాక్టర్ తలారి ఆశీర్వాదం, డాక్టర్ తలారి డాకన్న, తలారి సురేష్, తలారి గోపాల్, తలారి ప్రభు, బొర్రా మహేష్, బేగరి రాఘవులు, బేగరి పరమేశ్వర్ పాల్గొన్నారు.