Excise Department: రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా అందుబాటులో ఉన్న కౌంటర్లలో తమ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అయితే గత వారం బీసీ బంద్ (BC Bundh), బ్యాంకుల మూసివేతతో దరఖాస్తు చేయలేకపోయామని ఎక్సైజ్ శాఖకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తు గడువును అక్టోబర్ 23వ తేది వరకు పొడిగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులకు గాను బుధవారం సాయంత్రం వరకు 90,316 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. నేటితో గడువు ముగియనుండడంతో.. అశావహులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గడువు అనంతరం దరఖాస్తును పరిశీలిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. పరిశీలన పూర్తి అయిన వెంటనే అక్టోబర్ 27న లాటరీ సిస్టమ్ పద్ధతిన దరఖాస్తుదారులకు మద్యం దుకాణాలను కేటాయించనున్నట్టు వెల్లడించారు.
అంచనాలకు మించిన రెస్పాన్స్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన బీసీ బంద్, బ్యాంకుల సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు వచ్చిన ఫిర్యాదులతో ఎక్సైజ్ శాఖ ఈ గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది. ఈ పొడిగింపుతో దరఖాస్తుల సంఖ్య అనుహ్యంగా పెరిగింది. బుధవారం నాటికి దరఖాస్తుల సంఖ్య 90,316కు చేరింది. నేడు చివరి రోజు కావడంతో ఈ సంఖ్య లక్ష మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వానికి భారీ ఆదాయం: ప్రభుత్వం ఈసారి ఒక్కో దరఖాస్తు ఫీజును గతంలో ఉన్న రూ. 2 లక్షల నుంచి ఏకంగా రూ. 3 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు అందిన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 2,700 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ..ఆదాయం భారీగా పెరిగింది.


