తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన ప్రజా భవన్‌లో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్(All party meeting) జరుగుతుంది. ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతోపాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో సమావేశం కొనసాగుతోంది.
అయితే ఈ సమావేశానికి హాజరుకాకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు భట్టి విక్రమార్కకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. ఎంపీల సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ ఎంపీలకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా సమాచారం అందిందని చెప్పారు. ఎంపీలకు వారి నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని .. ఈ కార్యక్రమాల వల్ల భేటీకి హాజరు కాలేకపోతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఉంటే కాస్త ముందుగా చెప్పాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం, ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.