Alleti Maheshwar Reddy| తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం రాబోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanthreddy)కి కౌంట్ డౌన్ మొదలైందని.. త్వరలోనే ఆయన సీఎం కుర్చీకి ఎసరు పడబోతుందని ఆరోపించారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏడు సార్లు ఢిల్లీకి వెళ్లినా రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకలేదన్నారు. అలాగే కేరళలో కనీసం ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని కలవాలని ప్రయత్నించినా దర్శనభాగ్యం కలగలేదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2025 జూన్ నెల నుంచి డిసెంబర్ మధ్‌యలో తెలంగాణకు కొత్త సీఎం వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోందని.. అదే సమయంలో ఆశావహులు కూడా సీఎం పోస్టు కోసం పోటీ పడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
ఇక రూ.50వేల కోట్ల మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని లక్షన్నర కోట్ల వ్యయానికి రేవంత్ రెడ్డి పెంచారని.. ఇందులో భారీగా స్కామ్ జరగబోతోందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్ పెద్దలు రేవంత్‌ను దూరం పెడుతున్నారని విమర్శించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు సీఎం ఏకపక్ష ధోరణిని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హైడ్రా (HYDRA) , మూసీ (MUSI), ల్యాండ్ సెటిల్ మెంట్లపై కూడా హైకమాండ్ వద్ద తేల్చుకునేందుకు సీనియర్ మంత్రులు నివేదికలు పంపారన్నారు.
రేవంత్ రెడ్డి పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారని.. తద్వారా తాను సొంతంగతా లాభపడేందుకు కృషిచేస్తున్నారని పార్టీ పెద్దలకు సహచర నేతలు విన్నవించారని తెలిపారు. పార్టీ పెద్దలకు వస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే రేవంత్‌ను సీఎం సీటు నుంచి తప్పించడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో సీనియర్ నేతలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) సీఎం పదవి కోసం రెడీగా ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం కూడా పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారిందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.