Alligations on JubileeHills MLA Candidte Race Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి రేసులో అందరి కంటే ముందున్న నవీన్ యాదవ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇంటిపోరుతో ఆయన అభ్యర్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది. తన భర్తతో పాటు కుటుంబీకులు తనను వేధిస్తున్నారంటూ నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ భార్య మహితాశ్రీ మీనాక్షీ నటరాజన్‌కు సంచలన లేఖ రాయడం సంచలనంగా మారింది. రౌడీషీటర్ నేపథ్యం ఉన్న నవీన్ లాంటి వారికి రాజకీయాల్లో స్థానం కల్పించడం వల్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయంపై తాను అనేకసార్లు పోలీసులను, మహిళా కమిషన్లను, స్థానిక అధికారులను ఆశ్రయించానని, కానీ నవీన్ యాదవ్ రాజకీయ పలుకుబడితో తన ఫిర్యాదులను అణచివేశారని ఆరోపించారు. ప్రజల ప్రయోజనం కోసం, మహిళల గౌరవాన్ని కాపాడటానికి మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ ఆమె తన లేఖలో వెల్లడించారు. నవీన్ యాదవ్‌కు జూబ్లీహిల్స్ టికెట్ కన్ఫర్మ్ అయిందన్న వార్తల నేపథ్యంలో ఈ లేఖ సంచలనంగా మారింది.
ఓటర్ కార్డులు పంచినందుకు క్రిమినల్ కేసు..
కాగా, ఓటర్ కార్డులు పంచారని ఇప్పటికే నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మధురానగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో, నవీన్ యాదవ్ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లకు కొత్తగా జారీ అయిన ఓటరు కార్డులను పంపిణీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఓటరు కార్డు వంటి అధికారిక పత్రాలను రాజకీయ నాయకులు పంపిణీ చేయడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా ఎన్నికల సంఘం (ఈసీ) పరిగణించింది. ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అధికారులు ఇప్పటికే ఈ అంశంపై సీరియస్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు నవీన్ యాదవ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS యాక్ట్) సెక్షన్లు 170, 171, 174 లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరుస వివాదాల్లో చిక్కుకోవడం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రశ్నార్థంగా మార్చాయి. కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ వివాదంపై నవీన్, ఆయన కుటుంబ సభ్యులు స్పందించలేదు. తాజా పరిణామాలను నవీన్ యాదవ్‌కు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రగా ఆయన అనుచరులు భావిస్తున్నారు.


