Amberpet- Musherambagh bridge: దక్షిణ తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో.. మూసీకి వరద ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మూసీకి వరద భారీగా చేరడంతో అంబర్‌పేట-ముసారంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నదికి సమీపంలోని ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమీప కమ్యూనిటీ హాళ్లలో వారికి తగిన ఆహార ఏర్పాట్లు చేశారు.
జంట జలాశయాల గేట్లు ఎత్తివేత: ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో.. హైదరాబాద్ జంట జలాశయాలు అయిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. దీంతో జలమండలి అధికారులు అప్రమత్తయ్యారు.దీంతో అధికారులు అదనపు నీటిని విడుదల చేసేందుకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. మరోవైపు..వికారాబాద్ జిల్లాలోని శంకర్‌పల్లి మండలంలో కూడా భారీ వర్షాలు కురవడంతో టంగుటూరు-మోకిలీ రోడ్డు మూసివేయబడింది.
జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్: తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిలో భాగంగా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవే కాకుండా ఉత్తర తెలంగాణలోని మరో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నమోదైన వర్షపాతం వివరాలు:
- రంగారెడ్డి జిల్లా, తాళ్లపల్లి: 6.8 సెం.మీ
- గద్వాల జిల్లా, ఐజ: 6.4 సెం.మీ
- గద్వాల జిల్లా, గట్టు: 6.1 సెం.మీ
- రంగారెడ్డి జిల్లా, షాబాద్: 6.2 సెం.మీ
- వనపర్తి జిల్లా, ఆత్మకూరు: 6.2 సెం.మీ
- మహబూబ్‌నగర్, కౌకుంట్ల: 5.9 సెం.మీ
- హైదరాబాద్, డబీర్‌పురా: 3.1 సెం.మీ
- హైదరాబాద్, రాజేంద్రనగర్: 2.2 సెం.మీ
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, పాత, శిథిలావస్థకు చేరిన భవనాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నందున.. ప్రజలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను మరియు విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు కూడా తమ పంటలను జాగ్రత్తగా చూసుకోవాలని.. వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


