Saturday, November 15, 2025
HomeతెలంగాణJubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి బిగ్‌ షాక్‌.. ఆయన తండ్రితో సహా 170...

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి బిగ్‌ షాక్‌.. ఆయన తండ్రితో సహా 170 మంది రౌడీషీటర్ల బైండోవర్‌..!

Amid Jubilee Hills Bypoll Police bindover Rowdy Sheeters: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. ఇప్పటికే, నామినేషన్లు దాఖలు చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు.. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 170 మంది రౌడీ షీటర్లను బైండోవర్‌ చేశారు. ఇందులో జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌, అతని బాబాయి రమేష్‌ యాదవ్‌ ఉండటం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులుగా ఉన్న శ్రీశైలం యాదవ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలోనే రౌడీ షీట్‌ నమోదైంది. అయితే, రౌడీ షీటర్‌ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన నవీన్‌ యాదవ్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించడాన్ని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ తప్పుబడుతోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ (సోమవారం) జూబ్లీహిల్స్‌ పరిధిలోని ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఇదే విషయంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్‌ పార్టీ ఒక రౌడీ షీటర్‌కు టికెట్‌ కేటాయించింది. జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా మీకు ఇంకెవరూ దొరకలేదా? ఇలాంటి రౌడీ షీటర్లకు టికెట్‌ ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? రేప్పొద్దున ఇలాంటి వారు గెలిస్తే.. ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దగ్గర బలవంతంగా మామూళ్లు వసూలు చేస్తారు. సామాన్యులపై బెదిరింపులకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారు.” అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, పోలీసులు శ్రీశైలం యాదవ్‌ను బైండోవర్‌ చేయడంతో కేటీఆర్‌ వ్యాఖ్యలకు బలం చేకూర్చినట్లైంది. ఇదే అస్త్రంగా నవీన్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనుంది.

- Advertisement -

రౌడీషీటర్ల కదలికపై ప్రత్యేక నిఘా..

కాగా, పోలీసులు బైండోవర్‌ చేసిన వారిలో జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌ పరిధిలోని టోలిచౌకి, గోల్కోండ, జూబ్లీహిల్స్, మధురానగర్, ఫిలింనగర్, బోరబండ, పంజగుట్ట, సనత్‌నగర్‌ తదితర ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో నేరాలను నియంత్రించడంతో పాటు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను అదుపులో పెట్టడంలో భాగంగా వారిని బైండోవర్‌ చేశారు. అత్యంత ప్రముఖులతో పాటు, సినిమా వర్గాలు నివాసం ఉండే జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌ పరిధిలోని ఈ ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో సుమారు 170 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రౌడీషిటర్లు, అనుమానిత వ్యక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టించకుండా ఉండేందుకుగాను వారిని బైండోవర్‌ చేశారు. అంతేకాక వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవర్తన సరిదిద్దుకోవాలని, న్యాయస్థానంలో హామీపత్రంపై సంతకం చేయిస్తున్నారు. ఒకవేళ బైండోవర్‌ అయిన తర్వాత ఈ హామీని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన మరుసటి రోజు నుంచే అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లను బైండోవర్‌ చేయడమే కాకుండా వారందరూ ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచారం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? అనే విషయంపై పోలీసులు నిఘా ఉంచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad