హాస్టళ్ళ నిర్వాహకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్‌పేటలోని గురుగోవింద్ సింగ్ స్టేడియంలో హాస్టల్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ దేశంలోని అనేక రాష్ట్రాల నుండి వచ్చి నివసిస్తున్నారని, వారంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. కరోనా సమయంలో హాస్టల్స్ మూసివేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అద్దె విషయంలో హాస్టళ్ళ నిర్వహకులు, భవన యజమానులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఆ సమస్యను తాను పరిష్కరించిన విషయాన్ని తెలియజేశారు. విద్య, ఉద్యోగం కోసం నగరానికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారి కోసం హాస్టళ్ళను ఏర్పాటు చేసి వసతి, భోజనం సౌకర్యాలు కల్పిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బిఆర్ఎస్ అమీర్‌పేట డివిజన్ అద్యక్షుడు హన్మంతరావు, హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, సభ్యులు అనిల్, మారుతి, రాజశేఖర్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.