దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో అధికారం దక్కించుకున్న కాషాయం పార్టీ మిగిలిన రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచి సత్తా చాటిన బీజేపీ.. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు కైవసం చేసుకుని దుమ్మురేపింది. ఇక ఇటీవల జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచి తన పట్టు నిలుపుకుంది. దీంతో సగం తెలంగాణలో బీజేపీ హవా మొదలైనట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకులను, కార్యకర్తలను ప్రధాని మోదీ(PM Modi) ఇప్పటికే అభినందించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని, కార్యకర్తలను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని అఖండ విజయంతో ఆశీర్వదించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. మీ నమ్మకం మరింత కష్టపడి సేవ చేసేందుకు మాకు స్ఫూర్తినిస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) చేస్తున్న అలుపెరుగని కృషికి దక్కిన విజయం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)తో పాటు పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేసినందుకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ పేర్కొన్నారు.