Anchor Swecha Case Update: ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న పూర్ణచందర్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన పోలీసులకు సరెండర్ అయ్యారు. ఆమె ఆత్మహత్యకు తాను కారణం కాదని చెబుతున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు, కుమార్తె ఫిర్యాదు మేరకు పూర్ణచందర్ పై పోక్సో కేసు కూడా నమోదుచేశారు. అయితే లొంగిపోవడానికి ముందుకు పూర్ణచందర్ మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు.
ఆ లేఖలో ఏముందంటే..
“స్వేచ్ఛ నాకు 2009లో పరిచయమైంది. ఇద్దరం కలిసి టీన్యూస్ లో పనిచేశాం. ఆ సమయంలో స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం. ఆమె తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ 6 నెలల వయసు ఉన్న స్వేచ్ఛను వారి అన్న వదినల దగ్గర వదిలేసి సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయేవారు. తనను వదిలేసిన తల్లిదండ్రుల గురించి ఎన్నో సార్లు చెప్పుకుని స్వేచ్ఛ బాధపడేది.
తర్వాత స్వేచ్ఛ ప్రముఖ ఛానళ్లలో జర్నలిస్టుగా మంచి గుర్తింపు సంపాందించడం పట్ట నేను ఎంతో సంతోషించాను. దురదృష్టవశాత్తు 2008 నుండి 2009 మధ్య కాలంలో మొదటి వివాహాంలో విడాకులు.. 2016 నుండి 2017 ప్రాంతంలో రెండవ వివాహంలో విడాకులు తీసుకున్న స్వేఛ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. రెండవ వివాహం ద్వారా స్వేచ్ఛకు కలిగిన పాప అరణ్యలో సంతోషం వెతుకునేది.
2009 నుండి స్నేహితురాలిగా మాత్రమే పరిచయం ఉన్న స్వేచ్చ 2020 నుండి నాకు దగ్గరైన మాట వాస్తవం. 2017 రెండవ వివాహం ద్వారా జరిగిన విడాకుల తర్వాత హైదరాబాద్ రాంనగర్ లో వారి తల్లిదండ్రలతో ఉంటూ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆమె తల్లిదండ్రులు ఏరోజు స్వేచ్ఛకు అమ్మనాన్నల ప్రేమను అందించలేదు. వారిద్దరు పెట్టుకునే గొడవలతో ఇంట్లో ఉండలేక పోతున్నా అని నాతో చెప్పుకున్న సందర్భాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయి.
2020లో తల్లిదండ్రులతో ఉండలేక కవాడిగూడలో తను స్వంతంగా అద్దెకు ఇల్లు తీసుకొని ఉంది. 2022లో పాపను కూడా తల్లిదండ్రుల దగ్గర నుండి తన వద్దకు తెచ్చుకుంది. నాలాంటి జీవితం పాపకు రాకూడదు అని చెప్పేది. 2022 నుండి దాదాపు పాప భాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నాను. ఆమె చదువు, ఆమెకు కావలిసిన అన్ని అవసరాలను తండ్రి స్థానంలో బాధ్యత తీసుకున్నాను. పోయిన సంవత్సరము అరణ్య పుష్పావతి ఫంక్షన్ కు నా స్వంతంగా 5 లక్షల రూపాయల ఖర్చు చేయడం జరిగింది.
తన పాప అరణ్య నా పాప అయిపోయింది. పూర్తి, భాధ్యత తీసుకున్నా ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పాపను జాయిన్ చేయించాను. ఫీజులు కడుతూ వస్తున్నా.. ఇప్పుడు అరణ్య పాప 9 వ తరగతి చదువుతుంది. నాకు సేచ్చకు, అరణ్యకు ఎటువంటి విభేదాలు లేవు. మీడియా ద్వారా అరణ్య పాప మాటలు నన్ను బాధించాయి. సంఘటన జరిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి అతను అన్న మాటలు స్వేచ్ఛను పూర్తిగా బాధించాయి. ఆమెను పూర్తిగా అవమానించాడు వాళ్ల నాన్న.
రెండు సంవత్సరాలకొకసారి ఒక మనిషిని తీసుకువచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుంది. నాకు డబ్బు లేకపోవచ్చు. కానీ PDSUలో పని చేసాను, గౌరవాన్ని కోల్పోను అని స్వేచ్చ వాళ్ళ నాన్న చేసిన అనుచిత, అగౌరవ వ్యాఖ్యలు ఆమెను చాలా బాధించాయి. నాకు చెప్పుకొని ఏడ్చింది. స్వేచ్చ తన ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ లో స్వేచ్చ పూర్ణచందర్ అని రాసుకుంది. నన్ను భర్తగా ఊహించుకుంది. పెళ్ళి చేసుకోమంది.
స్వేఛ్ఛ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను. ఏ రోజు ఆమె చావును నేను కోరుకోలేదు. మీడియా ముందు వారి అమ్మనాన్నలు, బంధువులు చేస్తున్న అరోపణలు అబద్ధం. నేను ఏరోజు పెళ్లి పేరుతో మోసం చేయలేదు. ఒత్తిడి చేయలేదు. నేను ఈ లేఖ రాయకపోతే తెలంగాణ సమాజం అబద్ధం నిజం అనుకునే ఆస్కారం ఉంది” అని లేఖలో పేర్కొన్నారు.