Anchor Swecha case update: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న పూర్ణచందర్ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిపై బి.ఎన్.ఎస్ సెక్షన్ 69 , 108 సెక్షన్ తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా లొంగిపోయిన పూర్ణచంద్రకు విచారణ అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు వాదనలు విన్న న్యాయస్థానం పూర్ణచంద్రకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
కాగా ఎంతో చలాకీగా ఉండే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మృతికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమంటూ తల్లిండ్రులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పూర్ణచంద్రపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం సాయంత్ర పోస్టుమార్టం నిమిత్తం స్వేచ్ఛ అంత్యక్రియలు ముషీరాబాద్ శ్మశాన వాటికలో కుటుంబసభ్యులు పూర్తి చేశారు.
అయితే శనివారం రాత్రి పోలీసులకు లొంగిపోయిన పూర్ణచందర్.. తనపై స్వేచ్ఛ తల్లిదండ్రులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మీడియాకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో స్వేచ్చ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ డిప్రెషన్ కు గురైందని తెలిపారు. ఆమెకు రెండు సార్లు విడాకులు కావడం కూడా మానసికంగా కుంగదీసిందని పేర్కొన్నారు.