Andesri funeral with official honors: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అందెశ్రీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అందెశ్రీ హఠాన్మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపించాలని సీఎస్ రామకృష్ణా రావును సీఎం ఆదేశించారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం: అందెశ్రీ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానికంగా గల జీహెచ్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నేల కూలిన సాహితీ శిఖరం: అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతాన్ని కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని అన్నారు. అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది: అందెశ్రీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



