Ande sri life journey: తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాకవి డాక్టర్ అందెశ్రీ చరిత్ర ఒక మహోన్నత గాథ. నిరక్షరాస్యుడైన అందె శ్రీ తన ఆశుకవిత్వంతో తెలంగాణ సమాజంపై చెరగని ముద్ర వేశారు. ఆత్మగౌరవ పునాదులపై ఏర్పడ్డ తెలంగాణకు ఆయన రచించిన గేయమే రాష్ట్ర గీతంగా ఉంది. జయజయహే తెలంగాణ సృష్టికర్త డా. అందెశ్రీ జీవిత ప్రస్థానం ఓ అమోఘం. అట్టడుగు జీవితం నుండి శిఖరాగ్రానికి ఎదిగిన ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
గొడ్ల కొట్టంలో మొదలైన బాల్యం: అందెశ్రీ 1961, జూలై 18న వరంగల్ జిల్లా (ప్రస్తుత సిద్ధిపేట జిల్లా) రేబర్తి గ్రామంలో జన్మించారు. అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీ చిన్ననాటి నుంచే కష్టాల కడలిని ఈదారు. తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ జీవితం ఆయనది. అయితేనేం అతడిని పల్లె ప్రకృతి అక్కున చేర్చుకుంది. అందుకే కాబోలు ఆయన ప్రతి పాట.. పల్లెతో ముడిపడి ఉంటుంది. తల్లిదండ్రులు లేని తన బాల్యం గొడ్ల కొట్టంలో మొదలైంది. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాన్ని అందెశ్రీ బాల్యం నుంచే ప్రారంభించారు. బుక్కెడు బువ్వ కోసం గొడ్ల కాపరిగా, బర్రెల కాపరిగా, కూలీగా పనిచేశారు. దీంతో ఆయన విద్యకు దూరం అయ్యారు.
నిరక్షరాస్యుడు.. అయితేనేం ఆశుకవిత్వానికి నిలువుటద్దం: గొడ్ల కాపరిగా తన బాల్యం మొదలైంది. పల్లె తనకు తల్లి అయ్యింది. ప్రకృతి గురువైంది. అందుకే కాబోలు అందెశ్రీ తన చిన్నతనంలోనే అపారమైన కవితా పటిమను పొందారు. నిరక్షరాస్యుడు కావడంతో ఆశు కవిత్వం చెప్పే నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా రోజులు గడుస్తున్నకొద్ది.. తన జీవితంలో ఓ కీలక మలుపు చోటుచేసుకుంది. అందెశ్రీ సాహిత్య పటిమకు మంత్రముగ్ధుడైన శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ ఆయన్నీ అక్కున చేర్చుకున్నాడు. అతడిని దత్తత తీసుకుని తన సాహిత్యాన్ని ప్రోత్సహించారు. స్వామీ శంకర్ మహారాజ్ వల్ల అందెశ్రీ జీవితం కీలక మలుపు తిరిగింది.
తెలంగాణ ఉద్యమ సింహం: మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర అనిర్వచనీయం. ఆయన కేవలం పాటలు మాత్రమే రాయలేదు. ప్రజల్లో ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా “జయజయహే తెలంగాణ జననీ జయకేతనం” గీతాన్ని రచించారు. ఆయన రాసిన పాటలు, గేయాలు తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఆత్మగౌరవాన్ని అందించాయి.
ప్రజాదరణ పొందిన గీతాలు: ఆయన రచనలు, పాటలు ప్రజల కష్టాలను, ఆవేదనను ప్రతిబింబించేలా ఉంటాయి. అందుకే సినిమా పెద్దలు అందెశ్రీని పదేపదే కలిసేవారు. పల్లే ప్రజలకు దగ్గరైన తన సాహిత్యాన్ని పాటల రూపంలో సినీ ప్రపంచానికి అందించాలి అందెశ్రీని కోరేవారు. దీంతో అతడి మనసు సినీ ప్రపంచం వైపు మళ్లింది. అందులో భాగమే.. ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట.
అందెశ్రీని రాసిన పాటలు:
- ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’ (ఎర్ర సముద్రం చిత్రం)
- ‘పల్లె నీకు వందనములమ్మో’
- ‘గలగల గజ్జెలబండి’
పురస్కారాలు – గౌరవాలు: నిరక్షరాస్యుడైన అందెశ్రీకి తన ఆశుకవిత్వం కారణంగా అనేక అత్యున్నత గౌరవ పురస్కారాలు దక్కాయి. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు. 2006లో ‘గంగ’ సినిమాకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు వచ్చింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారంతో తెలంగాణ ప్రభుత్వం అందెశ్రీని గౌరవించింది. ఇంతటి మహోన్నత అందెశ్రీ.. భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన రచించిన తెలంగాణ రాష్ట్ర గీతం, ఆత్మగౌరవ పాటలు తెలుగు ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటాయి.


