Saturday, October 5, 2024
HomeతెలంగాణAndole: ఆందోల్ లో బెల్టు షాపుల రాజ్యం, గ్రామాభివృద్ధి కమిటీలు కూడా!

Andole: ఆందోల్ లో బెల్టు షాపుల రాజ్యం, గ్రామాభివృద్ధి కమిటీలు కూడా!

ఆందోల్ జిల్లాలోని మద్యం వ్యాపారులు వ్యూహాత్మకంగా, విచ్ఛల విడిగా బెల్ట్ షాపులను కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లైసెన్స్ పొందిన వ్యాపారులు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తుస్తున్నప్పటికీ బెల్ట్ షాపుల పేరిట అక్రమ ఒప్పందాలు నిర్వహిస్తూ తమ వ్యాపారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. జిల్లాలో మద్యం విధానం అమలు చేస్తుండగా లాటరీ పద్ధతుల్లో లైసెన్స్‌లను కేటాయించారు. లైసెన్స్‌లకు ప్రతీ వైన్స్‌కు అనుబంధంగా సిట్టింగ్ రూములకు పర్మిట్ ఇచ్చారు. అయితే గతంలో ఈ వ్యాపారాన్ని కొనసాగించిన వారికి లాటరీ పద్ధ్దతిలో వైన్ షాపులు దక్కక పోవడంతో అక్రమ ఒప్పందాలు కొనసాగించి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో డబ్బులు ఎర చూపి బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు.

- Advertisement -

కొంత మొత్తం ఇచ్చి..

గ్రామ అభివృద్ధి పేరిట కొంత మొత్తాన్ని ఆయా గ్రామాలకు చెల్లిస్తుండడంతో బెల్ట్ షాపులు దక్కించుకున్న వ్యాపారులు అడ్డగోలు ధరలను నిర్ణయించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బహిరంగంగా వీడీసీల పాత్ర ఉన్న చోట ఈ రకమైన వ్యాపారాన్ని మద్యం వ్యాపారంలో పునీతులైన వారు కొనసాగిస్తుండగా వీడీసీలు లేని ప్రాంతాల్లో లైసెన్స్ దారులతో కుమ్మక్కై లాభాల్లో వాటాలను పొందుతూ అటు లైసెన్స్ దారులు ఇటు అక్రమ వ్యాపారులు తమ వ్యాపారాన్ని యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ప్రదానంగా జిల్లాలోని సంగారెడ్డి ,ఆందోల్ , పుల్కల్, వట్పల్లి , జోగిపేట్ లలో జోరుగా సిండికేట్ దందా నడుపుతున్నారు. లాటరీ పద్దతిలో అనుభవం లేని వ్యక్తులకు సైతం వైన్ షాపులు దక్కడంతో వారికి కొంత మేర నగదును చెల్లించి వారి పేరిట మద్యం వ్యాపారంలో సిద్ధహస్తులైన వారు తెర వెనుక నుండి ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.

ఎమ్మార్పీలుండవు..

కొన్ని ప్రాంతాల్లో ఒకే సిండికేట్ ధరలకు ఎక్కువ షాపులు దక్కడంతో ఇతరులను సైతం తమలో కలుపుకొని సిండికేట్‌గా మారి ఎమ్ఆర్‌పీ ధర కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎంఆర్‌పీ ధరలకు మద్యం అమ్మకాలు సాగుతున్నప్పటికీ పల్లె ప్రాంతాల్లో మాత్రం అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియులను దోపిడికి గురి చేస్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు క్వాటర్‌పై 20 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. ఆందోల్ నియోజకవర్గంలో ఈ అక్రమ దందాకు అడ్డు లేకుండా పోయిందని చెబుతున్నారు. అడపాదడపా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా ప్రయోజనం లేదు. వైన్ షాపులు లేని మండలాల్లో ఈ బెల్ట్ షాపులకు కొదవ లేకుండా పోయిందంటున్నారు.

అక్కడే బెల్టు షాపులు ఎక్కువ..

పట్టణ ప్రాంతాల్లో, దినసరి కూలీలు, జిన్నింగ్, రైస్‌మిల్లులు, సిరా మిక్స్, కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బెల్ట్ షాపులు బెడద ఎక్కువగా ఉందంటున్నారు. సంగారెడ్డి, ఆందోల్ , పుల్కల్, జోగిపేట్ మండలాల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో గ్రామంలో బెల్ట్ షాపుకు మూడు నుంచి ఏడు లక్షలకు పైగా పలుకుతున్నట్లు చెబుతున్నారు. జనాభాకు ఆధారంగా ఈ ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది. బెల్ట్ షాపుల ఆదాయంతో గ్రామ అభివృద్ధి కమిటీలు సైతం పుట్టుకొస్తున్నాయి. గతంలో పట్టణాలు గల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకే పరిమితం కాగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వీడీసీలు ఆవిర్భవించినట్లు తెలుస్తోంది. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం జిల్లాలో ఎక్కడా బెల్ట్ షాపులు లేవని చెబుతున్నప్పటికీ మద్యం వ్యాపారానికి విధించే టార్గెట్ వీటి ద్వారానే చేరుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులకు ప్రతీ నెల మద్యం అమ్మకాల విషయమై టార్గెట్ విధిస్తుండడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నటు ఆరోపణలున్నాయి. మొత్తానికి జిల్లాలో బెల్ట్ షాపుల పేరిట మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ సిండికేట్‌దారులు మద్యం ప్రియులను కొల్లగొడుతుండగా సంబంధిత అధికారులు మాత్రం చేతులు ముడుచుకు పోతూ ఉంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News