Seethakka: అంగన్‌వాడీ కేంద్రాలకు ఆహార పదార్థాల సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండొద్దని, గుడ్ల సరఫరాలో లోపాలుండొద్దని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియట్‌లో శాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీలకు పాలు, గుడ్లు, పప్పు, నూనె, స్నాక్స్, బాలమృతం లాంటి ఆహార పదార్థాల సరఫరాపై మంత్రి ఆరా తీశారు. శాఖలోని పనుల పురోగతి, అమలవుతున్న పథకాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలు మినహా మిగిలిన సరుకులు 98 శాతంపైగా సరఫరా అవుతుండగా.. పాల సరఫరా కేవలం 58 శాతం మాత్రమే ఉందని అధికారులు వివరించారు. దీనిపై మంత్రి సీరియస్‌గా స్పందించి.. అన్ని ఆహార పదార్థాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుడ్ల సరఫరాలో కలర్ కోడింగ్ తప్పనిసరి అని, ప్రతి పది రోజులకోసారి గుడ్లు సరఫరా చేయాలని ఏజెన్సీలకు సూచించారు. ఈ నిబంధన పాటించకుంటే కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. 1,261 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాన్ని నవంబర్ 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిలోగా పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించామన్నారు. స్థానిక కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే ఏజెన్సీలకు బాధ్యత అప్పగించాలని సూచించారు. ఈ నెల 19, 20వ తేదీల్లో మహిళా భద్రతపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం, మహిళా సదస్సు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ సృజన, సిబ్బంది పాల్గొన్నారు.
అబద్ధాలకు కేటీఆర్ అంబాసిడర్
అబద్దాలకు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని మంత్రి సీతక్క ఆరోపించారు. ములుగులో మల్టీపర్పస్ వర్కర్ మైదం మహేశ్ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్ వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక సమ్మెలు చేసిన రోజులు ప్రజలు మరిచిపోలేదు. సిరిసిల్ల నుంచి సిద్దిపేట వరకు కలెక్టరేట్ల ఎదుట సఫాయి అన్నలు నిరసనలు చేస్తే పట్టించుకోని మీరు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే కార్మికులు నమ్మే పరిస్థితి లేదు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతి నెలా జీతాలు చెల్లిస్తున్నాం. ఇందుకోసం గ్రీన్ ఛానెల్ విధానాన్ని ప్రవేశపెట్టి, జీతాలు ఆలస్యం కాకుండా సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. మీ హయాంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియక ఇబ్బంది పడిన 50 వేల మందికిపైగా కార్మికులకు ఇప్పుడు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు అందుతున్నాయి. ములుగులో మైదం మహేశ్ జీతం ఆలస్యం కావడంలో ప్రభుత్వ తప్పిదం లేదు. జీతం ప్రాసెస్ చేసే సమయంలో స్థానిక పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో రెండు నెలల వేతనం ఆలస్యమైంది. ఇప్పటికే బాద్యులపై చర్యలు తీసుకున్నాం. మహేశ్ కుటుంబానికి పరిహారం అందిస్తాం. తాగునీళ్లు అనుకుని పొరపాటున పురుగుల మందు తాగానని మహేశ్ స్వయంగా చెప్పిన రికార్డులు ఉన్నాయి. అయినప్పటికీ దాన్ని రాజకీయంగా వాడుకోవడం, శవ రాజకీయాలు చేయడం కేటీఆర్‌కే చెల్లింది’ అని సీతక్క మండిపడ్డారు.


