రాష్ట్రంలో మూడు పంటల నినాదం బీఆర్ఎస్ పార్టీదైతే.. మూడు గంటల కరెంట్ నినాదం కాంగ్రెస్ పార్టీదని షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ కాంగ్రెస్ తీరును విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నందిగామ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో అదనంగా 12 లక్షల విద్యుత్ కనెక్షన్లు, షాద్ నగర్ నియోజకవర్గంలో 7,873 విద్యుత్ కనెక్షన్లు పెరిగాయన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నను అవమానించడమేనని అన్నారు. రైతులను అవమానించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి తీరాలని, అలాంటి పార్టీకి రాబోవు ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ది చెప్పాలన్నారు.